High Tension at Tadipatri | తాడిపత్రి: జేసీ బ్రదర్స్ హవా కొనసాగే అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు మిద్దె శ్రీరామ్ రెడ్డి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దాడికి దిగారని తెలుస్తోంది. జేసీ అనుచరులు శ్రీరామ్ రెడ్డికి చెందిన పలు వాహనాలపై రాళ్ల దాడికి పాల్పడి ధ్వంసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పెళ్లిలో కూడా రాజకీయాలు, రౌడీయిజం చేయడం ఏంటని బాధిత వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.
స్థానిక టీడీపీ నేత సంజీవరెడ్డి కుమారుడి వివాహ వేడుక ఆదివారం తాడిపత్రిలోని ఎస్ ఆర్ టీ ఫంక్షన్ హాల్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు కందిగోపుల మురళి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు, దౌల్తాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్ మిద్దె శ్రీరాం రెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు. అయితే, వేడుకకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో సంజీవరెడ్డి సోదరుడైన మిద్దె శ్రీరామ్ రెడ్డిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ‘నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు. వెంటనే ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్లాలని’ డిమాండ్ చేశారు.
అక్కడే ఉన్న తాడిపత్రి వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రవర్తనపై వెంటనే స్పందించారు. ఫంక్షన్ హాల్ నుంచి మేమెందుకు బయటకు వెళ్లాలి? అని సూటిగా ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలోనే ఇరువర్గాల నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. తన మాట శ్రీరామ్ రెడ్డి, కందిగోపుల మురళీ వినకపోవడంతో అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి వెళ్లిపయారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లిపోయిన కాసేపటికే ఆయన అనుచరులు ఫంక్షన్ హాల్ వద్దకు రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ వర్గీయులతో గొడవకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు శ్రీరామ్ రెడ్డి సహా మరికొందరు నేతల కార్లను ధ్వంసం చేయడంతో వివాహానికి వచ్చిన అతిథులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తాడిపత్రిలో రాజకీయ విభేదాలు పెళ్లి ఫంక్షన్లలోనూ ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
