Tirumala Darshan Tickets : వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకూ భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో దాదాపు 11 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనంకు సంబంధించిన సామాన్య భక్తులకు అందించే ఉచిత సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను రేపటి నుండి టిటిడి ప్రారంభించనుంది. ఇందుకోసం తిరుపతిలో దాదాపు తొమ్మిది కేంద్రాల్లో 100 కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్లను టిటిడి భక్తులకు అందించనుంది.. అయితే సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఎటువంటి తోపులాట జరుగకుండా తిరుపతి కలెక్టర్ వెంకటరమణ రెడ్డి, ఎస్పి పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి.
తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 100కుపైగా కౌంటర్ల ఏర్పాటు
జనవరి 1 నుండి టోకెన్ల జారీ ప్రారంభించి కోటా పూర్తి అయ్యే వరకు నిరంతరంగా జారీ చేయనుంది టిటిడి.. ముఖ్యంగా తిరుపతిలో ఎంఆర్.పల్లె జెడ్పి హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి, రామానాయుడు స్కూల్, జీనకోన జెడ్పి హైస్కూల్, తిరుమల కౌస్తుభం,భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి సత్రం, మున్సిపల్ కార్యాలయాల వద్ద సర్వదర్శనం టోకెన్లను టిటిడి జారీ చేయనుంది.. ఇక రామచంద్ర పుష్కరిణి, ఇందిరామైదానం, శ్రీనివాసం, విష్ణునివాసం, గోవిందరాజస్వామి సత్రాల వద్ద ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టారు.. టోకెన్లు ఏ తేదీ ఏ సమయానికి జారీ చేస్తున్నారనే వివరాలు భక్తులకు తెలిసేలా ఎల్ఈడి స్క్రీన్లలను టిటిడి ఏర్పాటు చేసింది.. అంతేకాకుండా తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల్లో భక్తుల సౌకర్యం కోసం క్యూఆర్ కోడ్ సదుపాయంను టిటిడి ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా 5 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు.
ఐదు లక్షల వరకూ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భధ్రతలో భాగంగా సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తుల కోసం క్యూలైన్లు, బారికేడ్లను ఏర్పాటు చేశారు.. ఈ కేంద్రాల వద్ద పోగయ్యే చెత్త ఎప్పటికప్పుడు తొలగించడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పారిశుధ్య కార్మికులను నియమించారు.. అంతేకాకుండా మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సరఫరా, ప్రతి కౌంటర్ వద్ద భక్తులకు టిఫిన్, అన్నప్రసాదాలు, టీ,కాఫీ, తాగునీరు నిరంతరంగా సరఫరా చేయడానికి టిటిడి అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆన్ లైన్‌లో జారీ చేసిన టిక్కెట్లు నిమిషాల్లో అయిపోవడంతో భక్తులు నిరాశ చెందారు. అయితే ఉచిత దర్శన టిక్కెట్లు మాత్రం సామాన్య భక్తులకు పెద్ద ఎత్తున అందుబాటులో తీసుకు రావడంతో.. ఎక్కువ మంది ఈ టిక్కెట్ల కోసం తిరుపతికి చేరుకునే అవకాశం ఉంది.దర్శనానికి కేవలం టిక్కెట్లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు . అందుకే ఈ టిక్కెట్లకు మరితం డిమాండ్ ఉండే అవకాశం ఉంది టీటీడీ అధికారులు ఎంత మంది వచ్చినా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
2022లో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు