మొన్నటి వరకు టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ ఫైట్‌తో కుప్పం కంటిమీద కునుకులేకుండా గడిపింది. ఇప్పుడు అధికార పార్టీ వైసీపీలోనే విభేదాలతో మరోసారి కుప్పం హీటెక్కింది. ఇరు వర్గాల మధ్య మనస్పర్థలు కారణంగా రక్తం చిందింది. 


చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. కుప్పం వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ భరత్ వర్గీయులు, ప్రత్యర్థులు ఓ ప్రైవేటు స్థలంలో కొట్టుకున్నారు. ఎమ్మెల్సీ భరత్‌ పీఏ, కుప్పం మాజీ వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ మురుగేష్‌పై కుప్పం మున్సిపల్ వైస్ ఛైర్మన్ మునిస్వామి మారణాయుధాలతో దాడికి దిగారు. 


వైసీపీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఫైట్‌లో మురుగేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం కుప్పం పిఈఎస్ ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ ఛైర్మన్ పిఏ రాము, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పిఎ సుబ్రమణ్యంపై కూడా దాడి జరిగింది. కుప్పం బైపాస్ రోడ్డులోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఈ ఘటన జరిగింది.


ఈ విషయాలను బయటకు రానివ్వకుండా వైసీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.