Chittor Flys Issue: రాజమౌళి సినిమాలో ఒక ఈగ విలన్ ను ముప్పు తిప్పలు పెట్టింది. ఈగ సినిమాలో రాజమౌళి ఈగ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. నిజ జీవితంలో ఇలాంటివి జరగవు కానీ, ఈగలు మనుషులకు ముప్పు తెచ్చే రోగాలను ప్రబలేలా మాత్రం చేయగలవు. కానీ, ఓ పల్లెపై దాడి చేస్తే కలిగే ప్రభావం ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఈగ పేరు వింటేనే బైరెడ్డిపల్లి మండలం, నగరే పల్లి గ్రామం ప్రజలు పరుగులు పెడుతున్నారు. లక్షల కొద్ది ఈగలు ఈ గ్రామాన్ని చుట్టు ముట్టి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈగల కారణంగా గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు విసుగు తెప్పించాయి.
అంతే కాకుండా గ్రామస్తులను ఓ వేడుక చేసుకోకుండా, కనీసం పూర్తిగా తిండి తినకుండా చేస్తున్నాయి. తలుపులు వేసుకుని నిద్రించాలన్నా ఈగల బెడదతో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పొలం పనులకు వెళ్ళినా, గ్రామంలో బయట తిరగలేక, ఇంటిలో తలుపులు వేసుకుని ఉండలేక ప్రజలు అవస్ధలు పడుతున్నారు. ఇక వండుకున్న ఆహారంలో సైతం ఈగలు ముసరడంతో కడుపారా తిండి తినలేక పోతున్నారు. దీంతో గ్రామంలో నివాసం ఉంటున్న 150 రైతులు, కూలి కుటుంబాలు ఈగల బెడదను తట్డుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. రేయింబవళ్ళు తేడా లేకుండా ఈగలు మూకుమ్మడిగా గ్రామస్తులపైకి దండయాత్ర చేయడంతో దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు గ్రామస్తులు.
కోళ్లఫారాల వల్లే..
గ్రామంలో సంచరిస్తున్న ఈగల కారణంగా చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో గ్రామస్తులు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్ధితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామం సమీపంలోని కోళ్ల ఫారాలే ఈగలకు కారణంమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కోళ్ళ ఫారాల నుండి వచ్చే వ్యర్ధాల కారణంగానే ఈగల వ్యాప్తి అధికం అయ్యాయని, కోళ్లఫారాల యజమానులకు అనేక మార్లు తమ అవస్ధలు చెప్పుకున్న పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇదే విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇకనైనా జిల్లా అధికారులు తమ పరిస్ధితులను అర్ధం చేసుకుని ఈగల బెడద నుండి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. ఈగల బెడద కారణంగా తమ గ్రామం ప్రజలు అనారోగ్యం బారిన పడి ప్రాణాల పైకి తెచ్చుకోవాల్సిన పరిస్ధితి నెలకొంటుందని, ఇప్పటికే కొందరూ గ్రామం వదిలి వెళ్ళి పోతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
Also Read: Indian Railway: రైలు ప్రయాణికులకు శుభవార్త, ఈ మార్గాల్లో రైళ్ల పునరుద్ధరణ!