దేశంలో ప్రముఖ ఆలయాల్లో శ్రీకాళహస్తి ఆలయం‌ కూడా ప్రముఖమైనది. దక్షిణ కాశీగా పేరున్న ఈ దేవలయానికి నిత్యం వేల‌మంది భక్తులు తరలి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు.  


ఎప్పుడూ లేనంతగా రద్దీ


మహాశివరాత్రి పర్వదినాన ఈ భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ఇవాళ కూడా అలానే భారీగా భక్తులు తరలి వచ్చారు. మహా శివరాత్రి నాడు శివయ్య సేవలో తరిస్తే కుటుంబానికి శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో మహిమ కలిగిన పంచభూతాల్లో ఒక్కటైనా వాయు లింగం ఇక్కడ ఉందని భక్తులు  విశ్వాసం. భక్త కన్నప్ప స్వయంగా ఆరాధించిన శివలింగం కూడా కావడంతో చాలా ప్రసిద్ధి చెందింది. 


తిరుపతి నుంచి నేరుగా శ్రీశైలం


ఏడుకొండలపై కొలువైయున్న శ్రీనివాసుడి దర్శనం అనంతరం కచ్చితంగా భక్తులు శివయ్య సేవలో తరిస్తూ ఉంటారు. దీంతో నిత్యం వేల సంఖ్యలో భక్తులు శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకుని స్వామి, అమ్మవార్ల కాటక్షాన్ని పొందుతుంటారు.  


జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు దర్శనం నవగ్రహాల వక్ర చూపు నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసం కూడా భక్తులకు ఉంది. అందుకే మహాశివరాత్రి కచ్చితంగా శ్రీకాళహస్తి చేరుకొని భక్తుల ప్రత్యేక పూజలు చేస్తుంటారు. 


నేడు కిక్కిరిసిన క్యూలైన్లు


ఇలా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉంది. శివరాత్రి సందర్భంగా అలాంటి ఏర్పాట్లు కనిపించ లేదు. ఎక్కడికక్కడ క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. గంటల తరబడి నిలుచో లేక తీవ్రంగా ఇబ్బందులకు గురి అయ్యారు భక్తులు. క్యూలైన్ వద్ద తాగు నీరు నిలువ నీడ లేదు.  


వీఐపీ సేవలో అధికారులు, ఎమ్మెల్యే ఫ్యామిలీ


విఐపిల సేవలో అధికారులు, స్ధానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తరించారు. దీంతో సామాన్య భక్తులకు చుక్కలు కనిపించాయి. చంటిపిల్లలు, వృద్దులు క్యూలైన్స్‌లో గంటల తరబడి నిల్చోలేక పోయారు అవస్థలు పడ్డారు. 


అలా అయికే క్షణాల్లో దర్శనం


ఉన్నతాధికారుల సిఫార్సులు, స్ధానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, అనుచరుల సిఫార్సుతో వచ్చిన వారికి క్షాణాల్లో దర్శనం భాగ్యం కలిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. సామాన్య భక్తుల దర్శనాలను ఆపేసి వీఐపీ సేవలో అధికారులు ఉన్నారని విమర్శలు వినిపించాయి.  


స్వామి, అమ్మవార్ల దర్శనం కావాలంటే ముందుగా శ్రీకాళహస్తి స్ధానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కుమార్తె పవిత్రరెడ్డిని దర్శించుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు భక్తులు. 


చాలా రోజుల తర్వాత తరలి వచ్చిన భక్తులు


ముఖ్యమైన రోజుల్లో సామాన్య వద్ద నుంచి వివిఐపిల వరకూ శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శిస్తుంటారు. వారి వారి స్తోమతకు తగ్గట్టుగా పరపతి ఉపయోగించుకుని దర్శనాలు చేసుకుంటారు. అయితే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి పర్వదినం అంటే ఎంతో ప్రాముఖ్యత కలిగింది. రెండేళ్ల నుంచి కరోనా ప్రభావంతో దర్శనాలకు ఎక్కువ మంది రాలేదు. ఇప్పుడు కరోనా తగ్గడంతో భారీగా భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. దీంతో శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో నిండి పోయింది. 


అధికారులు సైలెంట్‌, ఎమ్మెల్యే ఫ్యామిలీ ఆధీనంలోకి ఆలయం! 


సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన ఆలయ  ఈవో, అధికారులపై బాధ్యత విస్మరించాలనే ఆరోపణలు చేశారు భక్తులు.  స్ధానిక ఎమ్మెల్యే రాకతో ఆలయ అధికారులు ఏమీ పట్టనట్లుగా సామాన్య భక్తులకు దూరంగా ఉండి పోయారు. స్ధానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కుమార్తె పవిత్రారెడ్డి అంతా తమదే అన్నట్టుగా దర్శనాలు కల్పించారు. స్వామి వారి వద్ద బాధ్యతలు మధుసూదన్ రెడ్డి చూసుకుంటే.. అమ్మవారి వద్ద కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి చూసుకున్నారు. 


ప్రశ్నిస్తే శివతాండవమే


శివయ్యను, అమ్మవారిని అతి దగ్గరగా చూసుకునే భాగ్యం ఎవరకి కల్పించాలో వీళ్లే చూసుకుంటున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. దీంతో ఎవరూ ఎమ్మెల్యేను ప్రశ్నించలేక నిమ్మకుండి పోయారు. 


అమ్మవారి సన్నిధిలోనూ కుమార్తె పెత్తనం కొనసాగడంతో సామాన్య భక్తులు స్వామి, అమ్మవార్లను కన్నులార చూడలేక పోయారు. సామాన్య భక్తులు ఇబ్బందులు ఏమాత్రం గ్రహించకుండా అధికారులు, ఎమ్మెల్యే విఐపిల సేవలో తరించడంపై భక్తులు తీవ్రంగా మండిపడ్డారు.