CPI Narayana: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రతి హామీని నెరవేర్చాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని చెప్పారు. అయితే గురువారం నాడు నారాయణ తిరుపతి నగర శివార్లలోని శెట్టిపల్లి భూములను సందర్శించారు. ఈ క్రమంలోనే ఆ భూముల సమస్యలను వెంటనే తీర్చాలని వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో శెట్టిపల్లి భూముల్లో ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసిన బాధితుల, రైతులకు సంబంధించిన భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే నారాయణ మాట్లాడుతూ.. గతంలో తిరుపతి నగర శివార్లలో ఉన్న శెట్టిపల్లి భూములను తక్కువ ధరకు ప్రజలు కొనుగోలు చేసి.. ఇళ్లు కట్టుకోవాలనుకున్నారని చెప్పారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చి ల్యాండ్ పూలింగ్ పెడతామని.. 500 ఎకరాలను తీసుకుంటామని చెప్పినట్లు గుర్తు చేశారు. అలాగే వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినట్లు వెల్లడించారు.
నాలుగేళ్లు గడుస్తున్నా హామీలు ఎందుకు నెరవేర్చలేదు..
అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఇప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ స్థలంలోనే మీటింగ్ పెట్టి చంద్రబాబు చెప్పిందంతా అబద్ధం అని వెల్లడించినట్లు నారాయణ స్పష్టం చేశారు. అలాగే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే భూములను ప్రజలకే ఇచ్చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేన్నారు. కనీసం ప్రజలకు మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్రామీణ, నగర వైసీపీ నేతల మధ్య వాటాలు పంచుకోవడంలో తేడాలు రావడంతో శెట్టిపల్లి భూముల అంశాన్ని మరింత వివాదాస్పదం చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్ విధానంలో చేపట్టిన భూసేకరణను తప్పు పట్టిన జగన్... నాలుగేళ్లు గడుస్తున్నా ఎందుకు పరిష్కరించలేరో చెప్పాలని నారాయణ అడిగారు.
వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయం..
రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయం అని సీపీఐ నారాయణ వెల్లడించారు. అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలన్న ఆలోచన సరైనది కాదన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలన్న పవన్ కల్యాణ్ నిర్ణయం మంచిదేనని.. కాకపోతే టీడీపీ, బీజేపీతో కలిసి వెళ్లడం మంచిది కాదన్నారు. అలాగే మార్గదర్శి విషయంలో వైసీపీ ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని విమర్శించారు నారాయణ. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలన్నారు. పోలవరం ఎత్తు పెంచడంతో పాటు నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. పోలవరం విషయంలో విభజన హామీల హక్కులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిపోయిందన్నారు. మీకు పోరాడటానికి భయంగా ఉంటే అఖిల పక్షానికి ఢిల్లీ తీసుకువెళ్ళండి, విభజన హామీలు మేం సాధించుకు వస్తామని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.