Court Orders TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దేశంలోనే అత్యంత ఎక్కువ సంపాదన కలిగిన బోర్డుల్లో ముందు వరుసలో ఉంటుంది. తిరుమల, తిరుపతిలో ఏ చిన్న కార్యాన్ని అయినా టీటీడీనే చూసుకుంటుంది. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు అన్నీ ఈ బోర్డు కిందకే వస్తాయి. కేవలం తిరుమల, తిరుపతిలోనే కాకుండా టీటీడీకి దేశ వ్యాప్తంగా ఆలయాలు, సత్రాలు ఉన్నాయి. వాటి నిర్వహణకు కావాల్సిన డబ్బులు టీటీడీనే పంపిస్తుంది. అలాంటి బోర్డుకు వినియోగదారుల కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఓ భక్తుడికి ఏకంగా రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. టీటీడీకి ఇంత పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వాలని కోర్టు ఎందుకు చెప్పింది. ఏ కేసులో వినియోగదారుల కోర్టు ఈ తీర్పు ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. 


రుసుము తీసుకొని దర్శన భాగ్యం కల్పించలేకపోయింది..! 
రుసుము తీసుకుని కూడా ఓ వ్యక్తికి సమయానికి శ్రీవారి దర్శనాన్ని కల్పించలేకపోయింది టీటీడీ. దీంతో ఆ వ్యక్తి తమిళనాడు సేలంలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. తనకు జరిగిన నష్టాన్ని కోర్టు ముందు ఉంచాడు. ఇరు వైపులా వాదనలు విన్న కన్జ్యూమర్ ఫోరం.. టీటీడీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన హరి భాస్కర్ అనే వ్యక్తి .. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకున్నాడు. మేల్ చాట్ వస్త్రం సేవ కోసం 2006లో టీటీడీకి రూ.12 వేల 250 రుసుముగా చెల్లించాడు. కానీ టీటీడీ ఇప్పటివరకు తనకు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించలేక పోయిందని హరి భాస్కర్ చెప్పాడు. 


2006లో రుసుము చెల్లించాడు.. 
2006 లో నగదు చెల్లించి నేటికి దాదాపు 17 సంవత్సరాలు అవుతోంది. ఈ కాలంలో ఆయన పలు మార్లు టీటీడీకి దర్శనం కల్పించాల్సిందిగా అభ్యర్థించాడు. కానీ టీటీడీ నుండి ఏ స్పందనా రాలేదు. అతడు పదే పదే అడుగుతున్నా.. టీటీడీ పట్టించుకోలేదు. కరోనా సమయంలో మేల్ చాట్ వస్త్రం సేవకు బదులుగా వీఐపీ టికెట్ ఇస్తామని టీటీడీ అతడికి చెప్పింది. కానీ, దానికి హరి భాస్కర్ ససేమిరా అన్నాడు. తను మేల్ చాట్ వస్త్రం సేవకు రుసుము చెల్లించినప్పుడు అదే సేవల భాగ్యం కల్పించాలని చెప్పాడు. దానికి టీటీడీ ఒప్పుకోలేదు. హరి భాస్కర్ చేసిన విజ్ఞప్తిని టీటీడీ పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకున్న ఆ భక్తుడు తమిళనాడులోని సెలం వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. భక్తుడి ఫిర్యాదు మేరకు కన్జూమర్ కోర్టు విచారణ చేపట్టింది. ఇరు వైపుల వాదనలు విన్నది. 17 సంవత్సరాలుగా తనకు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించలేదని ఫిర్యాదు దారుడు కోర్టుకు తెలిపాడు. అతడు చెల్లించిన రుసుముకు సంబంధించిన ఆధారాలు సమర్పించాడు. 


దర్శనం కల్పించాలి లేదంటే నష్ట పరిహారం చెల్లించాలి.. 
కరోనా సమయంలో వీఐపీ టికెట్ ద్వారా దర్శనం కల్పిస్తామంటే హరి భాస్కర్ నిరాకరించాడని టీటీడీ కోర్టులో పేర్కొంది. వాదోపవాదాల తర్వాత కన్జ్యూమర్ కోర్టు టీటీడీ కి వ్యతిరేకంగా, భక్తుడికి మద్దతుగా తీర్పు చెప్పింది. సంవత్సరం లోపు ఆ భక్తుడికి మేల్ చాట్ సేవ దర్శన టికెట్ కేటాయించాలని.. లేకపోతే హరి భాస్కర్ కు రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.