CM Jagan Tirupati Tour: భూమి పూజలు, పలు శంకుస్థాపనలు, వకుళా మాత ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనడానికి నేడు (జూన్ 23) రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పోలీసు విభాగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి విమానాశ్రయానికి చేరుకున్న తరువాత అక్కడ నుంచి ఒక ఆలయాన్ని ప్రారంభించడానికి హెలికాప్టర్లో ఆలయం సమీపానికి చేరుకుంటారు. ఆలయం వద్ద హెలిప్యాడ్, ఆలయం పరిసరాలలో భద్రతా ఏర్పాట్లను అనంతపురం రేంజ్ డి.ఐ.జి రవి ప్రకాష్, జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఎస్పీ సతీష్ బాబు కలిసి బుధవారమే పర్యవేక్షించారు.
అదేవిధంగా శ్రీకాళహస్తి మండలంలోని ఇనగలూరు వద్ద అపాచీ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. అక్కడినుంచి బయలుదేరి రేణిగుంట సమీపంలోని టి.సి.యల్ (ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్) పరిసర ప్రాంతాలను కూడా పోలీసు భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా పరిశీలించారు. ఈ సందర్భంగా కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే ప్రాంతాలలో కాన్వాయ్ ట్రైల్ రన్ నిర్వహించి భద్రతను సమీక్షించారు. ప్రతి ప్రాంతంలో సంబంధిత పోలీసు అధికారులకు సూచనలు ఇస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
సీఎం పర్యటనకు పోలీస్ అధికారులు సివిల్ విభాగం నుండి 1,050, ఏ.ఆర్ విభాగం నుండి 730 మంది మొత్తం 1,780 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఇ.సుప్రజ, L&O కులశేఖర్ గారు, వెస్ట్ డీఎస్పీ నరసప్ప, ఏఆర్ డీఎస్పీ నంద కిశోర్, సీఐలు, ఆర్ఐ లు, ఇంటలిజెన్స్ అధికారులు పాల్గొన్నారు.
పూనం మాలకొండయ్య కుమార్తెకు సీఎం శుభాకాంక్షలు
వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో బుధవారం ఈ వేడుక జరిగింది. ఈ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పల్లవి, కృష్ణతేజలను ఆశీర్వదించి వారికి శుభాకంక్షలు తెలియజేశారు.