చిత్తూరు: గత రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలు ప్రాంతాల్లో పర్యటించారు ఈ క్రమంలో ఆదివారం చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఆయన పలమనేరు మండలం ముసలిమడుగులో నూతనంగా ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే, ఈ సమయంలో అక్కడ ఒక చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ ఎడమకాలికి స్వల్ప గాయమైంది. కాగా, ఈ సంఘటనకు సంబంధించి కొన్ని న్యూస్ మీడియాలో, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారు మహిళ కాలుపై నుంచి దూసుకెళ్లినట్లు కథనాలు వచ్చాయి. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. 

Continues below advertisement

దుష్ప్రచారమంటూ ఖండించిన జిల్లా అధికారులుఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన పలమనేరు మండలం ముసలిమడుగు పర్యటనలో జరిగిన సంఘటనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళ్లే దారిలో జనాల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఆ మహిళ స్పృహ తప్పి కిందపడిపోవడంతో ఆమెకు గాయమైనట్లు తెలిపారు. గాయపడ్డ బాధితురాలిని వెంటనే పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించామని, అక్కడ డాక్టర్ పర్యవేక్షణలో అన్ని పరీక్షలు నిర్వహించామని చెప్పారు.

ఆమెకు ఎడమ కాలికి చిన్నపాటి గాయం అయిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బాధితురాలికి మెరుగైన వైద్య చికిత్స అందించడానికి జిల్లా యంత్రాంగం సహకారం అందించిందన్నారు. 

మానవ, ఏనుగుల ఘర్షణ నివారణ, జంతువుల సంరక్షణకు ‘హనుమాన్’

మానవులు, ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడంతో పాటు సరికొత్త సాంకేతికతతో జంతువులకు సంరక్షణ చేపట్టేందుకు రాష్ట్ర అటవీశాఖ రూపొందించిన ‘హనుమాన్’ ప్రాజెక్ట్ వివరాలను ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. 11 అంశాలతో కూడిన ఈ ప్రాజెక్ట్ ను అటవీశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు.

ప్రత్యేక యాప్ సిద్ధం చేయండి

మనుషులు, వన్య ప్రాణి మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న గజ ప్రజా యాప్ స్థానంలో నూతన సాంకేతికతో ప్రత్యేక యాప్ ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తమ పరిసర ప్రాంతాల్లో సంచరించే జంతువులు సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేలా ఆ యాప్ ఉండాలన్నారు. ఏనుగులకి ప్రత్యేక రేడియో కాలర్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చినట్టు అధికారులు పవన్ కళ్యాణ్‌కు తెలిపారు. ఏనుగుల సంచారం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది? గుంపులుగా తిరిగే ఏనుగులతో పాటు ఒంటరి ఏనుగులు సమాచారం కూడా తెలిసేలా చూడాలని సూచించారు. టెక్నాలజీ వినియోగించి ఏ ప్రాంతంలో ఏనుగులకి ఈ రేడియో కాలర్ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటే వాటికి ఏర్పాటు చేయాలన్నారు.