Chittoor Bus Accident Ex Gratia Amount: చిత్తూరు బస్సు ప్రమాదం ఘటనలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబాలకు రూ.50 వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ఆయన ఆదివారం రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. బస్సు లోయలో పడ్డ ఘటనలో చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున తక్షణ సాయం అందిస్తామని ప్రకటించారు.


బస్సు లోయలో పడడంతో అప్రమత్తం అయిన జిల్లా కలెక్టర్ హరినారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టడం అభినందనీయం అని ప్రశంసించారు. తక్షణమే భాకరపేట ఘాట్ రోడ్డులో రైలింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.


రాత్రి వేళ ఘోర ప్రమాదం


చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె - తిరుపతి జాతీయ రహదారిపై చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులోపెళ్లి బృందం బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి చిత్తూరు జిల్లా తిరుపతికి వెళ్తుండగా మలుపు వద్ద ప్రైవేట్ బస్సులో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ, చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు. మొదట ఆరుగురు చనిపోగా, నారావారిపల్లె పీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొదుతూ చిన్నారి చనిపోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య 8 కి పెరిగింది. తాజాగా మరో వ్యక్తి చనిపోయారు.


బస్సులో మొత్తం 50 మంది వరకు ప్రయాణిస్తుండగా.. పెళ్లి కొడుకుతో పాటు 45 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ప్రైవేట్ బస్సు లోయలో పడ్డ ఈ ప్రమాదంలో డ్రైవర్‌ నబీ రసూల్‌, మలిశెట్టి వెంగప్ప (60), మలిశెట్టి గణేశ్‌ ‍‌(40), మలిశెట్టి మురళి (45), కాంతమ్మ (40),  జె.యశస్విని(8), ట్రావెల్స్ క్లీనర్‌ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని తిరుపతి రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.


ఉదయం ఎంగేజ్‌మెంట్.. రాత్రికి రాత్రే విషాదం
అనంతపురం జిల్లా ధర్మవరం రాజేంద్ర నగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం చేశారు. తిరుచానూరులో ఆదివారం ఉదయం నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నిశ్చితార్థం చేసుకునేందుకు వరుడు వేణు కుటుంబం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు దాదాపు 50  మందితో బయలుదేరింది. చిత్తూరు జిల్లా పీలేరులో రాత్రి ఓ దాబా వద్ద భోజనాలు చేశారు. అక్కడి దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించగా భాకరాపేట ఘాట్‌లో ఓ మలుపు వద్ద అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ లోయలో పడటంతో ప్రమాదం జరిగింది.