Andhra Pradesh Latest News: ఏపీ, తమిళనాడు మధ్య ముఖ్యమైన రైల్వేలైన్‌కు సంబంధించి కీలక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు ఓకే చెప్పింది. రాయలసీమలో ముఖ్యంగా తిరుపతి నుంచి పాకాల చాలా ముఖ్యమైన రైల్వే లైన్‌గా మారిపోయింది. ఇప్పటికీ అక్కడ సింగిల్ లైన్ ట్రాక్ మాత్రమే ఉండడంతో రవాణాపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలు. అలాగే ఎక్కువ రైళ్లను నడపడానికి కూడా సింగిల్ ట్రాక్ అనేది ఇబ్బందికరంగా మారింది. అలాగే పాకాల నుంచి కాట్పాడి వెళ్లే లైన్ పరిస్థితి అంతే. ప్రజారవాణా మాత్రమే కాకుండా సరుకు రవాణాకు కూడా ఇది చాలా ముఖ్యమైన లైన్. ఇప్పుడు తిరుపతి నుంచి పాకాల మీదుగా కాట్పాడి వరకు రైల్వే లైన్ డబ్బింగ్ చేయబోతున్నారు. దీనితో ఆ మార్గంలో రైల్వే రవాణాకు సంబంధించిన కష్టాలు తీరబోతున్నాయి.

ప్రధానికి, రైల్వేమంత్రికి రామ్మోహన్ కృతజ్ఞతలు తిరుపతి నుంచి కాట్పాడి వరకూ డబ్లింగ్ పనులకు ఆమోదం తెలపడంతో ప్రధానమంత్రి మోదీ, రైల్వే మంత్రి వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ, రైలు-రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు కేంద్రప్రభుత్వం కీలక అడుగు వేసిందనీ తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే లైన్‌ను డబుల్ ట్రాక్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.1,332 కోట్లతో ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపడం చాలా సంతోషాన్ని కలిగించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఏపీ అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ ఒక కీలక మైలురాయి ఈ లైన్ డబ్లింగ్‌ వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత వేగవంతం, సౌకర్యవంతం కానుందని చెప్పిన మంత్రి అభిప్రాయపడ్డారు. విద్యా, వైద్య అవసరాల కోసం వెల్లూరుకు వెళ్లే ప్రయాణికులకు కూడా గొప్ప వరం కానుందని అన్నారు. ఏడాదికి 4 మిలియన్ టన్నుల వరకూ సరుకు రవాణా చేయడానికి ఈ రైల్వే ప్రాజెక్ట్ తోడ్పడనుంది. రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ సిమెంట్, స్టీల్ రంగాలకు మరింత చేయూతనివ్వబోతుందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ఈ డబ్లింగ్ ప్రాజెక్టు పనులు ప్రారంభమైతే పలు ప్రాంతీయ అభివృద్ధి పనులు వేగం పుంచుకుంటాయని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు డబుల్ ఇంజన్ పాలన విజయాన్ని ప్రతిబింబిస్తోందని కూటమి నేతలు చెబుతున్నారు.