Tirumala Parking: తిరుమల కౌస్తుభం పార్కింగ్ వద్ద ఆగిఉన్న కారులో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భక్తులు భయంతో పరుగులుతీశారు. ఓంగోలు నుంచి వచ్చిన భక్తులు ప్రయాణిస్తున్న రెనాల్ట్ డస్టర్ కారులోంచి పొగలొచ్చాయి. అప్రమత్తమై వెంటనే కారులో నుంచి దిగిపోయారు. ఆ తర్వాత కొన్ని సెకెన్లలోనే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్నవారు వెంటనే కిందకు దిగడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది.కారులో ఏసీ ఆన్ చేయగానే షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చేలరేగినట్టు అధికారులు గుర్తించారు.
మరోవైపు తిరుమలలో పార్కింగ్ చేసిన కారులో ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారులను కాపాడారు తిరుమల ట్రాఫిక్ పోలీసులు. వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి, సుమలతకు తమ ఇద్దరు చిన్నారులు. తన భర్త ఉపాధి పనులకోసం విదేశాల్లో ఉండడండో.. తన భర్త అన్నయ్య గంగయ్య కుటుంబంతో తిరుమల వెళ్లింది. సుమలత, గంగయ్య భార్య అలిపిరి వద్ద దిగి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. కారులోనే కొండెక్కిన గంగయ్య కారుని వరాహస్వామి అతిథిగృహం-1 పార్కింగ్ ఏరియాలో పార్క్ చేశారు. దర్శనానికి ఎలా వెళ్లాలో తెలుసుకునేందుకు పిల్లలు ఇద్దర్నీ కారులోనే ఉంచి అల్లుడితో పాటూ బయటకు వెళ్లాడు. డోర్ లాక్ చేయడంతో కొద్దిసేపటికి పిల్లలు ఊపిరాడక విలవిల్లాడారు. సమీపంలో ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు ఇది గమనించి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడకు చేరుకుని కారు అద్దాన్ని పగులగొట్టి చిన్నారులను కాపాడారు. అనంతరం పిల్లల్ని టీటీడీ హాస్పిటల్ కు తరలించారు. చిన్నారులను కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు తల్లి సుమలత.
ఏప్రిల్ 17 గురువారం రాత్రి తిరుమలలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి ఆలయం ముందున్న భక్తులను కలసి దర్శన ఏర్పాట్లపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. లడ్డూ, అన్న ప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయని భక్తులు చెప్పారు. తిరుమలలో అడుగుపెట్టినప్పటి నుంచి శ్రీవారి దర్శనం ముగిసేంత వరకు భక్తులకు అందించిన ఏర్పాట్ల గురించి ఆరాతీశారు. ఇంకా భక్తులకు కల్పించాల్సిన ఇతర వసతులు, మెరుగుపర్చాల్సిన వసతుల గురించి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. టీటీడీ సాంకేతివ సేవల్లో ఉండే లోపాలను కొంతమంది భక్తులు ఈ సందర్భంగా చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. వయోధిక వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్ లైన్ ద్వార దర్శనానికి అనుమతించాలనే టీటీడీ పాలకమండలి నిర్ణయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి కృతజ్ఞతలు తెలియజేశారు భక్తులు. ఈ నిర్ణయం వల్ల వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా త్వరగా శ్రీనివాసుడిని దర్శించుకోగలుగుతున్నారనే సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆలయంలో క్యూలైన్ల దగ్గరకు వెళ్లి కంపార్ట్ మెంట్స్ లో భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు..అక్కడున్న సిబ్బంది ప్రవర్తన గురించి ఫిర్యాదు చేశారు. స్పందించిన టీటీడీ చైర్మన్.. భక్తులతో సేవాభావంతో వ్యవహరించాలని సూచించారు. భక్తులకు కల్పిస్తున్న అన్న ప్రసాదం, తాగునీటి సదుపాయాలపై ఆరా తీశారు టీటీడీ చైర్మన్.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి