Road Accidents : శ్రీసత్యసాయి (Sathyasai ) , చిత్తూరు (Chittoor ) జిల్లాల్లో కార్లు బీభత్సం సృష్టించాయి. ఈ ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా...మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. పరిగి (parigi)మండలంలోని బిందునగర్ లో పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు తండ్రి, కొడుకులుగా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ మద్యం సేవించి...కారు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 


చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గుండిశెట్టి వద్ద కారు బీభత్సం సృష్టించింది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొంది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ అక్కడ్నుంచి పరారయ్యాడు. కారులో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. 


రెండ్రోజుల క్రితం హైదరాబాద్ పంజాగుట్టలో...
రెండ్రోజుల క్రితం హైదరాబాద్ పంజాగుట్టలో ఓ వ్యక్తి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అడ్డు వచ్చిన వారిని ఢీకొట్టాడు. స్థానికులు కారును అడ్డగించి...డ్రైవర్ కు  దేహశుద్ధి చేశారు. వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో పాదచారులపైకి దూసుకెళ్లింది. స్మార్ట్ బజార్‌కి ఎదురుగా ఉన్న పంజాగుట్ట జంక్షన్‌లో  కొంత దూరం వరకు తన కారు బానెట్‌పై యువకుడ్ని ఈడ్చుకెళ్లాడు. కారును ఆపడానికి స్థానికులు ప్రయత్నించినా...ఆపకుండా వెళ్లిపోయాడు. ఎట్టకేలకు డ్రైవర్‌ను ప్రజలు అడ్డుకుని చితకబాదారు. నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో గాయాల పాలయ్యాడు. పంజాగుట్ట పోలీసులు సుమోటోగా స్వీకరించి, ప్రాణాలకు హాని కలిగించేలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, నంబర్ ప్లేట్ తారుమారు చేసినందుకు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. ఓ కారు బైక్ ను బలంగా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.


ఎమ్మెల్యే కాలనీలో కారు బీభత్సం


మరోవైపు ఈనెల 26న ఎమ్మెల్యే కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్‌కు చెందిన లైఫ్‌స్పాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఓనర్... రామ్‌ నరేంద్ర బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12లో ఓ ఆస్పత్రికి వెళ్లారు. కారు డ్రైవర్‌ శ్రీనివాసులు...యజమానిని ఆస్పత్రి వద్ద దింపాడు. ఆస్పత్రి వద్ద పార్కింగ్‌ లేకపోవడంతో సమీపంలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ దగ్గర రోడ్డుపక్కన కారును పార్కింగ్ చేశారు. కారులోపలే డ్రైవర్ కూర్చున్నాడు. ఇంతలో అతివేగంతో వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో శ్రీనివాసులుకు గాయమైంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి అరెస్ట్ చేశారు. ఆ కారు వికారాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ గా పోలీసులు గుర్తించారు.