Roja in Rain Videos: మిచౌంగ్ తుఫాన్‌ ప్రభావంతో ఓ పక్క నియోజకవర్గం ప్రజలు ముప్పుతిప్పలు పడుతుంటే ఆ మంత్రి మాత్రం జోరు వానలో రీల్స్ చేసుకుంటూ వివాదంలో చిక్కుకున్నారు. నిత్యం ఏదో ఒక వివాదంలో తలదూర్చే మంత్రి రోజా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సింది పోయి గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రతి ఇల్లు తిరుగుతూ అందర్నీ పలకరించారు. అదే సమయంలో జోరు వానలో రోజా చిందులు వేసిన వీడియోలు వెలుగు చూసాయి. ప్రస్తుతం ఈ వీడియోలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.


జోరున కురిసే వర్షంలో పుత్తూరు మున్సిపాలిటీ పిళ్లారిపట్టు సచివాలయం పరిధిలోని 5 వ వార్డు తాయిమాంబాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి రోజా నిర్వహించారు. ఓ వైపు వర్షం జోరున కురిస్తుండగా. అవ్వా తాతలు, అక్క చెల్లెలతో ఆప్యాయంగా పలకరిస్తూ వార్డులలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని రోజా నిర్వహించారు. గ్రామ ప్రజలు వర్షం అని కూడా లెక్కచేయకుండా మంత్రికి ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. గడప‌ గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రీల్స్ చేయడం మాత్రం స్థానికుల్లో‌ ఉత్సాహం కనిపించినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి అయ్యుండి గడప గడపకు‌ మన ప్రభుత్వం కార్యక్రమంలో, అదీ వర్షంలో రీల్స్ చేయడం ఏంటని‌ ప్రశ్నిస్తున్నారు. తుపాను వల్ల ఓ వైపు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మంత్రి మాత్రం గొడుగు తిప్పుతూ ఎంజాయ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


స్పందించిన టీడీపీ


టీడీపీ కూడా రోజా వ్యవహార శైలిని విమర్శించింది. గతంలో చంద్రబాబు హాయాంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మంత్రులు, వరద బాధితులకు సహాయ సహకారాలు అందించేవారని, అందరికీ అందుబాటులో ఉండేవారని గుర్తు చేసింది. జగన్ ప్రభుత్వంలో మంత్రి రోజా మాత్రం వర్షంలో ఎంజాయ్ చేస్తున్నారంటూ టీడీపీ ఓ వీడియో ట్వీట్ చేసింది.