AP News: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గంజాయి మత్తులో ఘర్షణ చోటు చేసుకుంది. కుప్పంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ కలకలం రేపింది. ఒకరిపై మరొకరు కత్తులు, రాడ్డులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కుప్పం మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ తమ్ముడు వినయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణలో న్యాయవాది కుమారుడు, రాజకీయ నాయకులు కుమారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినయ్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.


అయితే, ఈ ఘర్షణలో ఓ న్యాయవాది కుమారుడు, ఇతర రాజకీయ నేతల పుత్రులు ఉన్నట్లుగా చెబుతున్నారు. టీడీపీ కార్యకర్త వినయ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణలు జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


ఇటీవలే తిరుపతిలో గంజాయి డోర్ డెలివరీ
తిరుపతిలో గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న వ్యవహారం ఇటీవలే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓ యువకుడిని పోలీసులు కూడా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 22 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. నగరి మండలం ఓజీ కుప్పానికి చెందిన యువకుడైన శ్రీనివాస్ తరచూ చెడు వ్యసనాలకు అలవాటు పడినట్లుగా పోలీసులు తెలిపారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఇలా గంజాయి రవాణా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 


ఇతను తిరుపతి ఏజెన్సీలో గంజాయిని కిలో రూ.పది వేలకు కొని చిన్న ప్యాకెట్ల రూపంలో చేసి వాటిని ఒక్కో పొట్లాన్ని రూ.300కు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇతని గురించి పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు స్థానిక మారుతీనగర్, కొత్తపల్లి క్రాస్ వద్ద నిఘా పెట్టి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.