Gudiwada Amarnath: కళ్ళు లేని వ్యక్తిలా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమరనాథ్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి గుడివాడ అమరనాథ్, వైసీపీ ఎమ్మెల్యేలు వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ఎంఎస్ బాబులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వెలుపల గుడివాడ అమరనాథ్ మీడియాతో మాట్లాడుతూ. ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రామాయపట్నం పోర్టు దాదాపు రూ.3,500 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతుందని చెప్పారు.
అది త్వరితగతిన పూర్తి కావాలని, ఏపీలో పేద వారికి అందిస్తున్న సంక్షేమంతో పాటు పారిశ్రామికంగా రాష్ట్రాని అభివృద్ధి చేయాలనే సీఎం ఆలోచనలకు అనుగుణంగా సముద్రతీరాల్లో ఒక్కటైన ఏపీకి అన్ని అవకాశాలు, అన్ని సౌకర్యాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు. సదరన్ కౌన్సిల్ మీటింగ్ ని తిరుపతిలో నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో ఉన్న అవకాశాలు మరింత బలోపేతం చేయడానికి విచ్చేసినట్లు ఆయన చెప్పారు.
కొంచెమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని గానీ, పేదవాడికి మేలు చేయాలనే ఆలోచన లేని ప్రభుత్వం 14 సంవత్సరాలు ఏపీని పరిపాలించిందన్నారు. అభివృద్ధి చేస్తున్న రాష్ట్రాన్ని, పేదవాడికి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కళ్ళు మూసుకుని చూస్తే అంతా అంధకారంగానే కనిపిస్తుందన్నారు. కళ్ళు ఉన్న గుడ్డివాడు చంద్రబాబు అని అందుకే ఆయనకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పేదవాడి సంక్షేమం అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు.
అందరూ కలిసి నిర్మించుకున్న హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిన తరువాత ఏపీని ఐటీ పరంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, విశాఖపట్నం లాంటి నగరాల్లో ఐటీకి మంచి అభివృద్ధి ఉంటుందని పునాదులు చేసారన్నారు. విశాఖను ఐటీపరంగా అభివృద్ధి చేయాలని, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలు మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని, మరో రెండు నెలల్లో విశాఖ నుండి ఇన్ఫోసిస్ కార్యకలాపాలు మొదలు కానుందని ఆయన ప్రకటించారు. అంతే కాకుండా ఐటికి సంబంధించిన పెద్ద పరిశ్రమలు ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలు ఐటికి ప్రధాన కేంద్రాలుగా తీర్చి దిద్దుతాంమన్నారు.
మూడు సంవత్సరాల్లో దాదాపు ముప్పై వేల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వంగా, భవిష్యత్తులో మరో నలభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఐటీ రంగ సంస్ధలను పిలుస్తున్నట్లు చెప్పారు. ఐటీ రంగంలో హైదరాబాదుతో పోటీ పడే విధంగా భవిష్యత్తులో ఏపీలో మహా నగరాలు ఉండాలని ఏపీ సీఎం కృషి చేస్తున్నట్లు చెప్పారు.
అందుకే బోటు తిరగబడింది
జూలై రెండో వారంలో వచ్చిన వరద చరిత్రలో ఎన్నడూ చూడలేదని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తు గానే అప్రమత్తం చేసి, ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు లాగా ప్రచారం చేసే అవసరం తమకు లేదని, ముప్పు ప్రాంతంలోని ప్రజలను రక్షించాలని ప్రభుత్వం కృషి చేస్తుందే తప్ప, చంద్రబాబు నాయుడిలాగా సినిమా షూటింగ్ లకు వైసీపీ నాయకులు వెళ్ళరని చెప్పారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు వెళ్ళిన చంద్రబాబు బోటు తిరగబడిందని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతంలో ప్రజలను ఎప్పటికప్పుడు ఆదుకుంటున్నామని ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు.