Murali Nayak: దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా వీర మరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ తల్లిదండ్రులను మంత్రి సవిత మంగళవారం పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల చెక్కు, ఐదు ఎకరాల స్థలాన్ని, ఆరు సెంట్ల ఇంటి జాగా పట్టాలను మురళీ నాయక్ తల్లిదండ్రులకు మంత్రి సవిత అందజేశారు.

భరతమాత ముద్దు బిడ్డ మురళీ నాయక్ అని మంత్రి సవిత కొనియాడారు. దేశ ప్రజలందరి గుండెల్లో మురళీ నాయక్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.  దేశ ప్రజలతో పాటు కూటమి ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని వీర జవాను తల్లిదండ్రులను ఓదార్చారు. ఏ కష్టం వచ్చినా తనను సంప్రదిస్తే వెన్నుదన్నుగా ఉంటానని భరోసా ఇచ్చారు.

అంతకుముందు కల్లితండాలోని మురళీ నాయక్ ఘాటు వద్దకెళ్లి నివాళులర్పించారు మంత్రి సవిత. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. త్వరలోనే మురళీ నాయక్ నివాసం నుంచి ఘాటు వరకూ రూ. 16 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించనున్నట్లు వెల్లడించారు. గోరంట్లతోపాటు జిల్లా కేంద్రంలో కూడా మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

2025లో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో, దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించాడు మురళీనాయక్. మురళీ నాయక్ చిన్నతనం నుంచే భారత సైన్యంలో చేరాలనే ఆశయం కలిగి ఉన్న వ్యక్తి. ఈ లక్ష్యం కోసం రైల్వేలో ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. 2022లో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో సైనికుడిగా ఎంపికయ్యాడు. సరిహద్దులో దేశ రక్షణ కోసం పోరాడుతూ, కాల్పుల్లో తీవ్రంగా గాయపడి, చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళుతుండగా మార్గంలోనే వీర మరణం పొందాడు.

మురళీ నాయక్ తల్లిదండ్రులకు ఏకైక సంతానం. కుటుంబం నిరుపేదగా ఉండి, జీవనోపాధి కోసం ముంబైకు వెళ్లారు. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకున్నాడు. ఆర్మీలో చేరాలనే ఉద్దేశ్యంతో రాత్రిపగలు కష్టపడ్డాడు. చివరకు సైనికుడిగా ఎంపికయ్యాడు. దేశ రక్షణలోనే అమరుడయ్యాడు.