జనవాణి పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన కార్యక్రమానికి కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది ప్రభుత్వం. అక్కడ ప్రస్తావనకు వచ్చే సమస్యలపై రియాక్ట్ అవుతోంది. ఆధారాలు, అధికారుల వివరణతో సమస్య వెనుక ఉన్న అసలు సంగతి చెబుతోంది. ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇలాంటి విమర్శలపై స్పందిస్తోంది.
వ్యక్తుల మధ్య సమస్యలకు రాజకీయ రంగు పులిమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వం. 2018లో చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలు పాటించినందుకు తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ప్లాట్లు రద్దయ్యాయని... ఆ వివాదంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని దోషిగా చూపించడంపై మండిపడింది. పవన్ కల్యాణ్ చేస్తోంది జనవాణి కాదని విషవాణి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన తిరుపతి జిల్లా కలెక్టర్ నివేదికతో వివరణ ఇచ్చింది ప్రభుత్వం.
తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన అనిత అనే మహిళతో హైడ్రామా సృష్టించిన పవన్ కళ్యాణ్... నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నారని ప్రభుత్వం మండిపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలను తిరుపతి జిల్లా కలెక్టర్ విచారణ చేసి నివేదించిన వివరాలను బయటపెట్టింది ప్రభుత్వం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామం, తారకరామనగర్‌లో ప్లాటు నంబరు 2400 వెనుక వాస్తవాలను ఈ నివేదికతో వెల్లడయ్యాయని పేర్కొంది.
ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం... 2004లో అనిత అనే మహిళకు ఇంటిపట్టాను కేటాయించింది ప్రభుత్వం. 6 నుంచి 12 నెలల్లోగా ఇల్లుగాని, గుడిసెగాని వేసుకోని పక్షంలో స్వాధీనంలో ఉంచుకోవాలని షరతు పెట్టారు. 2004 నుంచి ఎలాంటి గుడిసెకాని, ఇల్లు కాని కట్టుకుని 989 ప్లాట్ల లబ్ధిదారులకు 2018 చంద్రబాబు ప్రభుత్వం నోటిసులు జారీ చేసింది.
నోటీసులకు లబ్ధిదారుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్లాట్లను రద్దుచేస్తూ ప్రక్రియ ప్రారంభించింది అప్పటి ప్రభుత్వం. అదే క్రమంలో ప్లాటు నెంబరు 2400ను కూడా అప్పటి వరకు ఉన్న వ్యక్తుల పేరున రద్దు చేసి కొత్త వారికి కేటాయించారు. ఆ ప్లాట్‌ను వి. వెంకటేష్ అనే వ్యక్తికి కేటాయిస్తూ ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్ జారీ చేసింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. అలాగే 3వేల మందికి ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్ల జారీ చేశారు. అయితే ఒకేసారి అంతపెద్ద మొత్తంలో ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లు జారీచేయడంపై విచారణకు ఆదేశించి విచారణ జరుపుతున్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్.
తనకు ఎంజాయ్‌మెంట్ సర్టిఫికేట్ వచ్చిందని వెంకటేష్ అక్కడే ఓ షెడ్ వేసుకున్నారు. ఆయన పేరు మీదనే ఇంటి పన్ను కూడా కడుతున్నారు. కరెంటు బిల్ కూడా పే చేస్తున్నారు. షెడ్డు నిర్మిస్తున్న సమయంలో అనిత, వెంకటేష్ మధ్య వివాదం చెలరేగింది. తన భూమి అంటూ అనిత, కాదు ప్రభుత్వం తనకే కేటాయించిందని వెంకటేష్ గొడవ పడ్డారు. అప్పుడే ఆ షెడ్డును అనిత ఆక్రమించుకున్నారు అనిత. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంకటేష్.
పోలీసుల సాయంతో అనిత నుంచి తన షెడ్‌ను వెంకటేష్ స్వాధీనం చేసుకున్నారు. దాని చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. వెంకటేష్ బోయ కులానికి చెందిన వ్యక్తి. దొడ్లమిట్టలో ఒక కూల్‌డ్రింకు షాపులో కూలీగా పని చేస్తున్నారు. ఆయనతో వైఎస్‌ఆర్‌సీపీకి ఎలాంటి సంబంధం స్పష్టం చేసింది.
ఇలా ఇద్దరి మధ్య వెలుగు చూసిన వివాదాన్ని ప్రభుత్వానికి ఆపాదించి విమర్శలు చేయడం సరికాదని పవన్ కల్యాణ్‌కు సూచించింది ప్రభుత్వం. దీన్ని మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని మండిపడింది. విజయవాడ జనవాణి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఈ అంశాన్ని వీడియో తీసి అనుకూలమీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంచేసి... ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు విష ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వివాదంలో అనిత అనే అమహిళ నిన్న పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. తనను తరిమేసి తన భూమి లాక్కున్నారని బోరుమంది. అన్నీ తన పేరుమీదే ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై తమ ఫ్యామిలీని బయటకు గెంటేశారని ఏడ్చింది. ఇందులో వైసీపీ వాళ్ల హస్తం ఉందని ఆరోపించారామె.