తిరుపతిలో జరిగిన ఏపీ ట్రేడ్ అడ్వైజరీ కమిటీలో వ్యాపారానికి సంబంధించిన చాలా అంశాలు చర్చించామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఈజ్ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని వివరించారు. 2019లో ఎగుమతుల్లో ఏపీ 7 స్థానం ఉండేదని ఇప్పుడు నాల్గోస్థానానికి వచ్చామని వివరించారు. ఏపి వాణిజ్య వ్యవస్థలో పునర్ వ్యస్థీకరణ చేశామని మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు బుగ్గన. 


ఎన్ని మంచి ఫలితాలు నమోదు చేస్తున్నా... విపక్షలకు చెందిన మీడియా ఎప్పుడు అసత్యాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు బుగ్గన. భారత దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా  ఏపీ నిలుస్తోందని వివరించారు. 12 వేల కోట్లు నుంచి 13 వేల 500 కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు అసెంబ్లీ సాక్షిగా చెప్పామని గుర్తు చేశారు. అప్పులు ఏనాడు దాచలేదన్న బుగ్గన... కాగ్, ఆర్.బి.ఐ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిజాలు తెలుసుకోవచ్చని సూచించారు. 


చంద్రబాబు, పవన్ భేటీపై కూడా బుగ్గన తన స్టైల్‌లో సెటైర్లు వేశారు. టిడిపి కలవని, పొత్తు పెట్టుకొని పార్టీ అంటూ లేదని ఎద్దేవా చేశారు. వై.ఎస్ ఆర్ కాంగ్రెస్‌తో తప్ప అన్ని పార్టీలతో టిడిపి పొత్తు పెట్టుకుందని విమర్శించారు. 2014 నుంచి అసెంబ్లీలో టీడీపీ నేతలు మాట్లాడిన మాటలు, వాడిన భాష రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబు, జనసేన మధ్య ఎన్నోసార్లు పెళ్ళిళ్ళు అయ్యాయని.. విడాకులు అయ్యాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 


వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసినప్పుడు చంద్రబాబుకు ప్రజాస్వామ్య పరిరక్షణ గుర్తుకు లేదాని నిలదీశారు. ఆయన మాటలు వింటుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను చేసిందే కరెక్ట్ అన్నట్టు చంద్రబాబు తీరు ఉంటుందన్న బుగ్గన... ఆయన పాలసీలో నిలకడ లేదు, ఒక సిద్ధాంతం లేదని ఆరోపించారు. ఒకే పార్టీ తో ఎన్నిసార్లైనా కలుస్తారని అన్నారు. ప్రజాస్వామ్య విలువల్ని ఏనాడు చంద్రబాబు పాటించలేదన్నారు. 


ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఓపిక ఉండాలన్న బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి... పవన్ కల్యాణ్ వాఖ్యలను తప్పుపట్టారు. మూడు రాజధానులు మూడు ప్రాంతాలు అభవృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల అసమానతలు వచ్చాయని... వీటిని తొలగించడానికే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని తెలిపారు. కర్నూలలో కోర్టు, విశాఖలో సెక్రటేరియట్, గుంటూరులో అసెంబ్లీ పెట్టడం తప్పా అని ప్రశ్నించారు.