Murali Nayak: పాకిస్థాన్‌ దుశ్చర్యలపై పోరాడుతూ అమరుడైన వీరజవాను మురళినాయక్‌ అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఈ అంతిమ సంస్కారాలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాలో అంతిమవీడ్కోలు జరగనుంది.

మురళి నాయక్ భౌతికకాయం సాయంత్రానికి స్వస్థలానికి చేరుకుంటుంది. రేపు గుమ్మయ్యగారిపల్లి నుంచి భారీ ర్యాలీని నిర్వహించిన అనంతరం ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక, సైనిక లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐ.టీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు హోంమంత్రి అనిత హాజరుకానున్నారు.  

ఉగ్రస్థావరాలను కూల్చివేసేందుకు ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యతో పాకిస్థాన్ ఉలికిపాటుకు గురైంది. దీంతో భారత్‌పై ప్రతీకార దాడి చేసింది. పాక్ సేనల దుశ్చర్యలను అడ్డుకునే క్రమంలో మురళి నాయక్ వీరమరణం పొందాడు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళి సేవను అంతా కొనియాడుతున్నారు. 

అంత్యక్రియలకు రానున్న పవన్ , లోకేష్‌ మురళి తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతి బాయను కలిసి ధైర్యం చెప్పనున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. మురళి పార్తివదేహం ఇవాళ రాత్రికి కల్లితండాకు చేరుకోనుంది.

మృతి విషయాన్ని తెలుసుకున్న మురళినాయక్ చదివిన సోమందేపల్లి విజ్ఞాన్ పాఠశాల యాజమాన్యం,తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు నివాళి అర్పించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇదే స్కూల్‌లో చదివిన మురళి దేశ సేవ కోసం ఇండియన్ ఆర్మీలో చేరినట్టు పాఠశాల కరస్పాండెంట్ క్రిష్ణవేణి, మల్లికార్జున చెప్పారు. ఇదే విషయాన్ని తోటి విద్యార్థులతో చెప్పేవాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. మురళినాయక్‌తో చదివిన విద్యార్థులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.