AP Deputy CM Narayana Swamy: తిరుపతి : మూడేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పాలనపై ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. మూడేళ్ల పాలన ఎలా ఉందో తెలుసుకునేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లీనరి సమావేశాలు నిర్వహించారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. నేటి (ఆదివారం) శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.
శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా జరిగిన ప్లీనరి సమావేశాలకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పేదల తలరాత మారుస్తూ, అనేక సంక్షేమ కార్యాక్రమాలను చేస్తూ జగన్ ముందుకు వెళ్తున్నారు అనేందుకు ఇది నిదర్శనం అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వాగ్దానాలను ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. అన్ని పార్టీలు, ఎల్లో మీడియాతో పాటు దత్త పుత్రుడు సైతం ఏకమై వచ్చినా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎవరు ఎం చేయలేరని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు..
చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకుని విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. 85 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ సీఎం జగన్ వెనకాల ఉన్నారు. నిత్యవసర ధరలతో పాటు పెట్రోల్ ధరలను పెంచేది కేంద్ర ప్రభుత్వమని, కనుక ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దోచుకున్నదేమీ లేదని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుకి సపోర్ట్ చేసేవాళ్లు ఇక పిచ్చి వాళ్లుగా మిగిలి పోతారే కానీ ప్రజా నాయకులుగా పనికి రారంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్లీనరీ సక్సెస్‌పై జగన్ ట్వీట్..
‘నిరంతరం– దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు... ఇవే నాకు శాశ్వత అనుబంధాలు! కార్యకర్తలూ అభిమానుల సముద్రంగా మారిన ప్లీనరీలో... చెక్కు చెదరని మీ ఆత్మీయతలకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీ మద్దతుకు... మీ జగన్ సెల్యూట్, మరోసారి!’ అని వైసీపీ ప్లీనరీ సక్సెస్‌పై ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.