AP Congress News: ఏపీలో ప్రస్తుతం రాజకీయ సినిమా నడుస్తోందని.. ఇద్దరు సవతుల ముద్దుల మొగుడు రసవత్తరంగా సాగుతోందని ఏపీ కాంగ్రెస్ మీడియా ఛైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల ముద్దుల మొగుడు నరేంద్ర మోదీ అని అన్నారు. ఏపీకి రావాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత అని అన్నారు. గత పదేళ్లలో విభజన హామీలు అమలు చేసి ఉంటే ఏపీ స్వర్ణాంధ్ర అయ్యేదని అన్నారు. ప్రత్యేక హోదాకు బీజేపీ పంగనామాలు పెట్టిందని విమర్శించారు. పార్లమెంటులో ఇచ్చిన ప్రధాన హామీలేవీ అమలు కాలేదని.. వైసీపీ, టీడీపీ అధికారంలోకి వచ్చినా విభజన హామీలను నెరవేర్చుకోలేకపోయారని ఆరోపించారు.


విభజన వరాలను నెరవేర్చే దిశగా చంద్రబాబు అడుగులు వేయాలి. సకాలంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అమలుకు చంద్రబాబుకు ధన్యవాదాలు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారడం వల్లే చిత్తుచిత్తుగా జనం ఓడించారు. చంద్రబాబు పాలనలో కూడా శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ పై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి’’ అని అన్నారు.