Yamini Krishnamurthi Dies at 84 | అమరావతి: భరతనాట్యం కళాకారిణి, లెజెండ్ యామినీ కృష్ణమూర్తి ఢిల్లీలో కన్నుమూశారు. ఆమె మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యామినీ కృష్ణమూర్తి మరణంపై స్పందించారు. దేశం గర్వించదగిన శాస్త్రీయ నృత్యకారిణి, పద్మవిభూషణ్ గ్రహీత యామినీ కృష్ణమూర్తి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం నాడు తుది శ్వాస విడిచారని తెలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
1940లో మదనపల్లెలో జన్మించిన యామిని కృష్ణమూర్తి, క్రమంగా ఎదుగుతూ ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల (Tirumala Temple) ఆస్థాన నర్తకిగా సేవలు అందించారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో యామినీ కృష్ణమూర్తి నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎనలేని పేరు తెచ్చిపెట్టిన వ్యక్తి యామినీ కృష్ణమూర్తి అని కొనియాడారు. నృత్య కళా రంగంలో ఆమె లేని లోటును ఎవరూ తీర్చలేరని, ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
వైఎస్ జగన్ సంతాపం..
యామిని కృష్ణమూర్తి మరణం పట్ల ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూచిపూడి, భరతనాట్యం కళానృత్యాలను ఆమె మరో స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించిన జగన్, యామిని కృష్ణమూర్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.