Another Leopard in Tirumala: తిరుమలలో మరో‌సారి చిరుత సంచారం కలకలం రేపుతుంది.. మొదటి ఘాట్ రోడ్డులో 35వ మలుపు దగ్గర ఉన్న  శ్రీలక్ష్మీ నరసింహస్వామి  ఆలయ సమీపంలో నిన్న(మంగళవారం) రాత్రి 7గంటల 45 నిమిషాలకు చిరుత కనిపించింది. బైక్‌ వెళ్తున్న వారు చిరుత చూసి భయంతో కాసేపు వాహనం అక్కడే ఆపేశారు. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది, విజిలెన్స్‌ అధికారులు... చిరుత సంచరిస్తున్న ప్రాంతాన్ని  పరిశీలించారు. అక్కడ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత పాదముద్రలను సేకరించే పనిలో పడ్డారు. ఇటీవల నడక మార్గంలో, ఘాట్ రోడ్డులో చిరుత సంచారం పెద్దగా  లేకపోవడంతో టీడీపీ. అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ నిన్న (మంగళవారం) రాత్రి మళ్లీ చిరుత కనిపించడంతో టీటీడీ అధికారులు మరింత  అప్రమత్తమయ్యారు. మరోవైపు.. చిరుత సంచారంతో శ్రీవారి భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 


అలిపిరి కాలిబాట, శ్రీవారి మెట్టు మార్గం, ఘాట్ రోడ్డుల్లో చిరుత పులుల సంచారం టీటీడీని కలవర పెడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాలిబాట మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసి గాయపరిచిన ఘటన మరువక ముందే... ఆరేళ్ల బాలికపై దాడి చేసి చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో శ్రీవారి భక్తులు భయంతో వణికి పోయారు. కాలిబాట మార్గంలో తిరుమలకు వెళ్లాలంటేనే భయపడి పోయారు.‌. ఈ క్రమంలో భక్తుల భధ్రత దృష్ట్యా టీటీడీ కాలిబాట మార్గంలో ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నపిల్లల తల్లిదండ్రులను అనుమతించేలా చర్యలు చేపట్టింది. అంతేకాదు... భక్తులకు ఊతకర్ర ఇవ్వడం, ఏడో మైలు నుంచి గాలిగోపురం వరకు హైఅలెర్ట్ జోన్‌గా ప్రకటించింది. వంద మంది భక్తులను గుంపులు గుంపులుగా తిరుమలకు పంపించింది టీటీడీ. చిరుత సంచారిస్తున్న ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చి ఇప్పటి వరకూ ఐదు చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. ఆ తర్వాత కూడా కాలిబాట మార్గంలో ట్రాప్‌ కెమెరాల్లో చిరుత జాడలను టీటీడీ, అటవీ శాఖ అధికారులు గమనిస్తూనే ఉన్నారు. అయితే... కొద్ది రోజులుగా కాలిబాట మార్గం, ఘాట్ రోడ్డుల్లో చిరుత జాడ కనిపించక పోవడంతో అటవీ శాఖ, టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకుంది. భక్తులు కూడా నిర్భయంగా కాలబాటన కొండెక్కుతున్నారు. 


కానీ.. ఇప్పుడు మరోసారి చిరుత కనిపించింది. దీంతో మరోసారి అలర్ట్‌ అయ్యారు అధికారులు. భక్తులను గుంపులు గుంపులుగా తిరుమలకు పంపుతున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం దగ్గర పడుతున్న సమయంలో తిరుమలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. కాలిబాటన కొండెక్కే వాళ్లు సంఖ్య కూడా పెరుగుతుంది.ఈ క్రమంలో ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం అటు భక్తులను, ఇటు టీటీడీని కలవర పెడుతోంది. 


అయితే... టీటీడీ డీఎఫ్‌వో శ్రీనివాసులు చిరుత సంచారంపై స్పందిస్తూ.. తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం లేదని చెప్పారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర, గాలిగోపురం దగ్గర ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత జాడలు కనిపించలేదని తెలిపారు. చిరుత సంచారంపై అటవీ శాఖ నిఘా ఉందని... ఏడో మైలు నుంచి గాలిగోపురం వరకు భక్తులను గుంపులు గుంపులుగా తిరుమలకు అనుమతిస్తున్నామని చెప్పారు. భక్తులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.