పాములు పగ పడతాయా అంటే కొందరు అవునని సమాధానం ఇస్తే..కొందరేమో ఇదంతా ట్రాష్ అంటారు. కానీ ఓ మారుమూల గ్రామంలో జరిగిన ఘటన విన్నవాళ్లు మాత్రం ఆశ్చర్యపోతారు. పాము పగ పట్టిందని ఓ ఫ్యామిలీ భయానికి కారణమేంటి. ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులను నెల వ్యవధిలో దాదాపు తొమ్మిది సార్లు నాగుపాము కాటేయడానికి కారణమేంటి?. సకాలంలో స్థానికులు స్పందించి హాస్పిటల్ కు తరలించడంతో ప్రాణాలు దక్కాయి. ఇప్పటికీ ఇద్దరు పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 


చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం,ధోర్ణకంబాల ఎస్టీ కాలనీలో గురవయ్య ఫ్యామిలీ నివసిస్తోంది. ఆ కుటుంబంలో గురవయ్య, ఆయన కుమారుడు వెంకటేష్‌ దంపతులు, కుమారుడు జగదీష్ ఉన్నారు. గ్రామానికి చివరిలోఓ పూరి గుడిసేలో నివాసం ఉంటున్నారు.


వెంకటేష్‌ బండిపై ఐస్ క్రీంలు గ్రామాగ్రామాన తిరిగి అమ్మే వాడు. కూలీ పనులు చేసేవాడు. కుమార్తెను బంధువుల ఇంటిలో ఉంచి చదివించాడు. కొడుకుని పదో తరగతి వరకూ చదివించాడు.ఐదేళ్ళ క్రితం ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో ఓ చిన్న  గుడిసె వేసుకుని కాలం వెళ్ళ దీస్తున్న వారిని నాగుపాము ఇబ్బందులు పెడుతోంది.


ఓ చిన్న పాటి కొండ కింది ‌భాగంలో నివాసం ఉంటున్న వెంకటేష్‌ ఓ రోజు ఇంటి పరిసరాలు శుభ్రం చేస్తుండగా కత్తి జారీ పొదల్లో ఉన్న నాగుపాముపై పడింది. ఇది గమనించిన వెంకటేష్‌ పెద్దగా పట్టించుకోలేదు. పాము వెళ్లిపోయిందిలే అనుకున్నాడు. ఓరోజు రాత్రి అందరూ నిద్రిస్తున్న టైంలో నాగుపాము ఇంట్లోకి వచ్చి గురవయ్యను కాటు వేసింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేశారు. 
అప్పటి నుంచి కేవలం నెల రోజుల వ్యవధిలో దాదాపు తొమ్మిది సార్లు ఒకరి తరువాత ఒకరిని పాము కాటు వేస్తూనే ఉంది. ఫ్యామిలీ వాళ్లు పాము కాటుతో ఆసుపత్రి చుట్టూ తిరగడం రొటీన్ అయిపోయింది. గత నెలలో వెంకటేష్, వెంకటమ్మ,గురవయ్యను రెండేసి సార్లు పాము కాటు వేసింది. జగదీష్ ను మూడు సార్లు కాటు వేసింది. 


పాము కాటు వేసి ప్రతిసారి స్థానికులు సకాలంలో స్పందించి 108కు కాల్ చేయడం హాస్పిటల్ కు తరలించడం అలవాటుగా మారిపోయింది. ఇన్ని సార్లు పాటు కాటుకు గురైన ఆ కుటుంబం సభ్యులు ప్రాణాపాయం నుంచి బయట పడగలుగుతున్నారు. గత పది రోజుల క్రిందట పాము కాటు వేయడంతో వెంకటమ్మ, జగదీష్ ఆసుపత్రిలో చేరారు.. ఆసుపత్రి నుంచి రెండు రోజుల క్రితం డిశ్చార్ అయ్యి ఇంటికి చేరుకున్న రాత్రే మళ్లీ పాము కాటేసింది. మళ్లీ 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


వేంకటేష్ మాట్లాడుతూ ఏ కర్మో ఏమో గానీ దేవుడు ఎలా చూస్తే అలానే జరుగుతుందని తీవ్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అసలు పాము ఎందుకు తమ కుటుంబంపైనే పగ పట్టిందో తమకు ఏమాత్రం అర్ధం కావడం లేదంటున్నారు.. ఒకే పాము తమను కాటు వేస్తుందా..వేరే వేరే పాము ఏమైనా కాటు వేస్తుందా అనేది తమకు తెలియడం లేదన్నాడు.


 


తెల్లవారి జామునో, అర్ధరాత్రి సమయంలోనూ పాము కాటు వేస్తుందని,కాటుకు గురైనా ప్రతిసారి తనతోపాటు తన కుటుంబం మొత్తం నరకయాతనం అనుభవిస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నాడు వెంకటేష్‌. తమ ఇంటిళ్ళ పాది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నట్టు తెలిపాడు. పాములకు బయపడి రాత్రి సమయాల్లో ఇంటిని వదిలి గ్రామంలోని బంధువుల ఇంటిలో నిద్రిస్తున్నట్లు వెంకటేష్ అంటున్నాడు. ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ తమపై దయతలచి ఓ చిన్నపాటి ఇంటిని నిర్మించి ఇస్తే తమకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని వేంకటేష్ వేడుకుంటున్నారు..