Lakshmi Parvathi On Lokesh : టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పాదయాత్రపై తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్, వైసీపీ నేత ‌లక్ష్మీ పార్వతి సెటైర్లు వేశారు. మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. లోకేశ్ పాదయాత్ర రోజు రోజుకూ కామెడీ అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ రోజు రోజుకు దిగజారిపోతుందని ఆమె విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏంచేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఏమీ రాని దద్దమ్మ, ఒక్క చోట గెలవని వ్యక్తి సీఎం జగన్ ను విమర్శిస్తున్నారని ఆమె లోకేశ్ పై మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు చెప్పకుండా, బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అమరావతిలో ఇన్సైడర్ పేరుతో మోసాలు చేశారని, పోలవరం పేరుతో టీడీపీ హయాంలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. 


పవన్ కల్యాణ్ కు ఆ జ్ఞానం ఏమైంది


98 శాతం ఇచ్చిన హామీలు అమలు చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని లక్ష్మీపార్వతి అన్నారు. సోషల్ మీడియాలో పనికి మాలిన వారిని పెట్టుకుని వారిని పోషిస్తున్నారని, వారు మహిళలను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఎం జగన్ మోహన్ రెడ్డి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. టీడీపీ పాలనలో సీబీఐ రాకూడదని తీర్మానాలు చేశారని గుర్తుచేశారు. దుబాయ్, స్విట్జర్లాండ్ లో చంద్రబాబు ఐదు లక్షలు కోట్లు దాచి పెట్టారని ఆరోపించారు. ఈ నల్లధనం స్వదేశానికి రప్పించాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఈ నల్లధనం బయటకు తీసుకురావాలని ఆమె కోరారు. పవన్ కల్యాణ్ పుస్తకాలు చదువుతున్న జ్ఞానం ఎక్కడకి పోయిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడితే ఆరు నెలలైనా అర్థం కావడం లేదన్నారు. హిందూపురం ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని, సైకో ఎవరో తేల్చుకోవాలన్నారు. పనికిమాలిన పనులు చేస్తున్న చంద్రబాబు సైకో అని‌ ఆమె విమర్శించారు. మీ చంద్రబాబు పాపాలు పండి పోయాయని, చివరి దశకు చేరుకున్నాయని లక్ష్మీ పార్వతీ మండిపడ్డారు. 


తెలుగు అకాడమీ పేరుతో నకిలీ వెబ్ సైట్ 


 "రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు అకాడమీ, తెలుగు యునివర్సిటీను వదిలేశారు చంద్రబాబు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చొరవతో 2019 లో తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటుకు నిర్ణయించారు. తిరుపతి కేంద్రంగా వీటిని ఏర్పాటుచేయాలని సీఎం నిర్ణయించారు. తెలుగు అకాడమీ స్థాపించిన తర్వాత ఇంటర్మీడియట్ పుస్తకాలు ముద్రించాం. ప్రతి రాష్ట్రంలో సంస్కృత అకాడమీ ఉండటంతో ఏపీలో తెలుగు, సంస్కృతం అకాడమీ ఏర్పాటుచేశాం. తిరుపతి కేంద్రంగా 2022 నుంచి తెలుగు, సంస్కృతం అకాడమీ నిర్వహిస్తున్నాం. ఉన్నత విద్యాశాఖతో ఎంఓయూ కుదుర్చుకున్నాం. డిగ్రీ పుస్తకాలు ముద్రణ కూడా చేస్తాం. తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకువస్తాం. పోటీ పరీక్షలకు అవసరమయ్యే  సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన 17 రకాలు పుస్తకాలు ముద్రించబోతున్నాం. ఈ నెలలో  ఉగాది పురస్కారాలు అందజేస్తున్నాం. ఎన్.ఆర్.ఐ లు, వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్లు అందరికీ కోసం  లెర్న్ తెలుగు తెలుగు, సంస్కృతం అకాడమి పేరుతో వెబ్ సైట్స్ ఏర్పాటు చేస్తాం. సంస్కృతం అకాడమీ కూడా అభివృద్ధి చేస్తాం. జాతీయ సంస్కృత యునివర్సిటీతో కలిసి పనిచేస్తున్నాం. ప్రతి జిల్లా మాండలికంపై పుస్తకాలు ముద్రిస్తాం. తెలుగు అకాడమీ పేరుతో నకిలీ వెబ్ సైట్ ను గుర్తించాం.  దీనిపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాము. ఉద్యోగాలు ఇస్తామంటూ నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసాలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి రూ.90 కోట్లు నిధులు రావాల్సి ఉంది, విలువైన ఆస్తులు ఉన్నాయి, అయినా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాం" - లక్ష్మీ పార్వతి, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్