SriKalahasti Temple : తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని కాళహస్తి శైవక్షేత్రంలో  శనివారం వేకువజాము నుంచే భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరారు. భక్త జనసందోహంతో శివనామస్మరణతో ఆలయం మార్మోగుతుంది. మ‌హాశివ‌రాత్రి ప‌ర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వేల మంది భక్తులు తరలివ‌చ్చారు. దీంతో శ్రీకాళహస్తి క్షేత్రం జ‌న‌సంద్రంగా మారింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్వామి వారి గర్భాలయం వద్ద సామాన్య భక్తులకు దర్శనం కలిగించే విధంగా దగ్గరుండి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. భక్తులకు ఆలయ అధికారులు మెరుగైన సేవలు అందిస్తున్నారు. 


శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 


దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ  శైవక్షేత్రం అయినా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఓం నమశ్శివాయ నామస్మరణలతో భక్తకోటి జనంతో నిండిపోయింది. శివరాత్రి పురస్కరించుకొని దేశ విదేశాల నుంచి,  తమిళనాడు, కర్ణాటక  వివిధ రాష్ట్రాల నుంచి  భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు.   శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయ అధికారులు ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో, పండ్లతో, విద్యుత్ దీప అలంకరణలతో  సుందరంగా అలంకరించారు.  భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి వారికి అవసరమైన  తాగునీరు, బిస్కెట్లు, చిన్నపిల్లలకు పాలు వంటి ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. స్వామి అమ్మవార్లను దర్శనం కోసం భక్తులకు నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం పడుతుంది.  


కోటిలింగేశ్వరాలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు 


మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కర్ణాటక కోలారు జిల్లా, బంగారుపేట కమ్మసంద్రంలోని కోటిలింగేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినం వైభవంగా జరుగుతోంది. వేలాది మంది భక్తులు తరలివచ్చి మహాశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. శివలింగ దర్శనం కోసం కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. భక్తులు కోటిలింగేశ్వర శివలింగాల దర్శనం పొంది నూట ఎనిమిది అడుగుల ఎత్తైన భారీ శివలింగం దర్శించుకుంటున్నారు.  ఇక్కడ ప్రతిష్టించిన లక్షలాది లింగాల చుట్టూ ప్రదక్షిణలు చేసి భగవంతుని దర్శనం చేసుకుంటారు. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు నిర్వాహకులు. ఇక్కడకు వచ్చే శైవ విష్ణు భక్తుల కోసం ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. భక్తులకు ఇక్కడ రెండు రోజుల పాటు ప్రత్యేక పూజా హోమ హవనం, రాత్రి జాగరణ, భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 


వేయి స్తంభాల ఆలయం భక్తులతో కిటకిట 


హనుమకొండలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే వేయి స్తంభాల ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. రుద్రేశ్వరుని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల నామస్మరణంతో వేయి స్తంభాల ఆలయం మార్మోగింది .భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వేయి స్తంభాల ఆలయం కిటకిటలాడింది. భక్తులు రుద్రేశ్వరునికి పాలాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయం ముందు ఉన్న నంది విగ్రహం వద్ద భక్తులు దీపాలు వెలిగించి భక్తి భావాన్ని చాటుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రుద్రేశ్వరుని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు.


రామప్ప దేవాలయానికి పోటెత్తిన భక్తులు


 ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో కాకతీయుల కాలం నాటి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాత్రి శివపార్వతుల కళ్యాణం అనంతరం జాగరణ చేసే భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు.  జాగరణ చేయడానికి ఆలయ ప్రాంగణంలో సభా వేదికలను భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.  ములుగు గోవిందరావుపేట వెంకటాపూర్ మనపురం మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రామప్పలోని రామలింగేశ్వర దర్శనార్థం విచ్చేస్తున్నారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ములుగు సీఐ మేకల రంజిత్ ఎస్సై ఓంకార్ యాదవ్ వెంకటాపూర్ ఎస్సై తాజుద్దీన్ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు