Swaroopanandendra Saraswati : టీటీడీ పాలక మండలిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ  సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుపతిలో గంగజాతర సందర్భంగా తాతయ్యగుంట గంగమ్మను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, విశాఖ పీఠాధిపతి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతులకు ఆలయ పాలక మ‌ండలి, అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో మీడియాతో మాట్లాడుతూ 900 ఏళ్ల క్రితం అనంతళ్వార్ చేతుల మీదగా ప్రతిష్టించిన విగ్రహమే తాతయ్య గుంట గంగమ్మ వారని చెప్పారు. తన ప్రియ శిష్యుడు కరుణాకర్ రెడ్డి కోరిక మేరకు తాను ఇక్కడకు వచ్చానన్నారు. 


ఏ ప్రభుత్వమైన ఒక్కటే 


దళితలు, వెనకబడిన తరగతుల వారి కోసం పోరాడే ఏకైక పీఠం విశాఖ శారదా పీఠం అని స్వరూపానందేంద్ర సరస్వతి తెలియజేశారు. టీటీడీ పాలక మండలి ఛైర్మన్ గా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేపట్టిన ఏకైక వ్యక్తి కరుణాకర్ రెడ్డి అని ఆయన కొనియాడారు. టీటీడీ ఛైర్మన్ గా కరుణాకర్ రెడ్డి చేపట్టిన పనులకు అండగా శారదా పీఠం ఉండేదని, దళిత గోవిందం,‌ కళ్యాణమస్తు కార్యక్రమాలను విశాఖ పీఠం చేపట్టినట్లు చెప్పారు. కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తి మరోసారి టీటీడీ పాలక మండలికి రారు పుట్టబోరు అని, ఇప్పుడు ఉన్న పాలక మండలి పెద్దగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు.  కరోనా కారణమో లేక బుద్ది మాంద్యమో తనకు తెలియడం లేదన్నారు. తిరుపతి మీడియా ఎన్నో అటుపోట్లు ఎదుర్కొంటుందన్నారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలో ఆదిశంకరాచార్యుల విగ్రహం ప్రతిష్టించాలని ఆయన కోరారు. విశాఖ శారదా పీఠాధిపతిని టీటీడీ ఆర్జిత సేవల రద్దుపై వివరణ కోరిన మీడియాకు తప్పకుండా సేవలపై స్పందిస్తా్మన్నారు. తనకు ఏ ప్రభుత్వమైనా ఒక్కటే, రేపు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతానని ఆయన సమాధానం ఇచ్చారు.



గంగమ్మను దర్శించుకున్న మంత్రి రోజా 


తాతయ్యగుంట గంగమ్మను ఏపీ మంత్రి రోజా దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి ఆమె సారె సమర్పించారు. నగరంలోని సెంట్రల్ పార్క్ కూడలి నుంచి ఆలయానికి ఊరేగింపుగా సారె తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. సారెతో ఆలయం వద్దకు చేరుకున్న రోజాకు అర్చకులు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వెలుపల ఆర్.కే.రోజా మీడియాతో మాట్లాడుతూ.. గంగమ్మకు సారె సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని మంత్రి రోజా తెలిపారు. తిరుపతిలోనే తొలిసారిగా గంగ జాతర మొదలైందని, 900 ఏళ్ల ముందు అనంతాళ్వార్ తిరుపతిలో గంగమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఆమె వివరించారు. గతంలో తిరుపతి గంగమ్మను దర్శించుకుని భక్తులు తిరుమలకు వెళ్లేవారని, ఇకపై కూడా తిరుమల యాత్రకు ముందు తిరుపతి గంగమ్మను దర్శించుకోవాలని భక్తులను రోజా కోరారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి రోజా సహకారంతో తిరుపతి గంగ జాతర వైభవంగా నిర్వహిస్తున్నామని,  తన శాఖ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలకు నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.