Tirumala : తిరుమల కళ్యాణకట్టలో పని చేసే పీస్ రేట్ క్షురకులు భక్తులను ఇబ్బంది పెట్టడం సరైనా విధానం కాదని, క్షురకులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉచిత టైం స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లను నవంబర్ 1వ తేదీ నుంచి జారీ చేయనున్నట్లు ధర్మారెడ్డి ప్రకటించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ జారీ చేయనున్నామన్నారు. శని, ఆది, సోమ, బుధవారాల్లో రోజుకి 20 నుంచి 25 వేల టిక్కెట్లను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు.  ఏరోజు టైం స్లాట్ టిక్కెట్లను ఆ రోజే జారీ చేస్తామని స్పష్టం చేశారు. మంగళ, గురు, శుక్రవారాలలో 15 వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో అష్టదళపాద పద్మరాధన ఉంటుందని, గురువారం శుద్ది, శుక్రవారం అభిషేకాలకు అధిక సమయం కేటాయిస్తామన్నారు. ఈ కారణంగా ఈ మూడు రోజులు 15 వేల టోకెన్లు కేటాయిస్తామన్నారు.  


డిసెంబర్ 1 నుంచి బ్రేక్ దర్శనాల్లో మార్పు 


తిరుమలలో రద్దీకి అనుగుణంగా టోకెన్ల జారీ ఉంటుందని, టిక్కెట్లు లేని భక్తులు నేరుగా స్వామి వారిని వైకుంఠం 2 ద్వారా దర్శించుకోవచ్చని ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. వీఐపీ బ్రేక్ సమయంలో మార్పులు చేస్తున్నామన్నారు. సామాన్య భక్తుల సౌకర్యం కోసం ఈ మార్పు చేస్తున్నామని తెలిపారు. రాత్రి క్యూలైన్ లో వచ్చిన సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా చేయాలని చైర్మన్ ఆదేశించారని, సాధ్యా సాధ్యాలను పరిశీలించి 8 గంటలకు మార్పు చేయాలని నివేదిక ఇస్తామన్నారు. ప్రయోగాత్మకంగా డిసెంబరు 1వ తేదీ నుంచి ఉదయం 8 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో వసతి గదుల కేటాయింపులో ఒత్తిడి తగ్గనుందన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనం పొందిన భక్తులకు తిరుపతిలోని మాధవం వసతి గృహంలో వసతి ఏర్పాటు చేస్తామన్నారు. 


క్షురకులు ఆందోళన చేయడం సబబు కాదు 


భక్తులకు టిక్కెట్లను మాధవంలోనే ఆఫ్ లైన్ లో ద్వారా అందించేలా చర్యలు చేపడుతున్నట్లు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. టోకెన్ల సిస్టంపై ఓపెన్ స్క్రీనింగ్ ఉంటుందని, పరిస్థితి తగట్టు టోకెన్స్ విడుదల చేసే విధంగా పర్యవేక్షణ ఉంటుందన్నారు. శ్రీవాణి ట్రస్టు భక్తులకు అడ్వాన్స్ రూమ్ బుకింగ్ ఇస్తున్నామని తెలిపారు. తిరుపతిలో గదుల కేటాయింపు కౌంటర్లు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు. ఇక తిరుమలలోని కళ్యాణకట్టలో టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది వారి విధులు వారు నిర్వహించారని, క్షురకులు భక్తులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని, వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. తిరుమలలో ధర్నాకు వెళ్లడం సమంజసం కాదని, ఏదైన సమస్య తలెత్తితే ముందు టీటీడీ యాజమాన్యాన్ని సంప్రదించాల్సిందన్నారు. భక్తులు ఇస్తే డబ్బులు తీసుకోరాదని, ఒకవేళ వాళ్లు ఇచ్చిన దాన్ని హుండీలో వేయాలని చెప్పాలని క్షురకులు భక్తులను కోరాలని  ఈవో ఏవీ.ధర్మారెడ్డి తెలియజేశారు.