Tirumala News : తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నట్లు టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల భక్తులు పొందుతున్న సౌకర్యాలను వివరించారు. అనంతరం టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల గదుల రొటేషన్ పూర్తిగా తగ్గిందన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ టెక్నాలజీ చక్కగా ఉపయోగపడుతుందన్నారు. సామాన్య భక్తులు ఎవరైతే గదుల కోసం పేర్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఫేస్ రికగ్నిషన్ చేసుకుంటున్నారో, వారే ఉపవిచారణ కార్యాలయాల్లో గదులు పొంది, ఖాళీ చేసే సమయంలో కూడా నేరుగా వెళ్లి ఖాళీ చేస్తేనే కాషన్ డిపాజిట్ రిఫండ్ చేస్తామని తెలిపారు. ఒకసారి తమ ఆధార్ కార్డుతో గదులు పొందిన భక్తులు మళ్లీ 30 రోజుల తర్వాతే గదులు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. మార్చి 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గదుల కేటాయింపు ద్వారా అత్యధికంగా రూ.2.95 కోట్ల రాబడి వచ్చిందని తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్, కరెంటు బుకింగ్ లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వసతి కోసం పేర్ల నమోదు కౌంటర్లను ప్రయోగాత్మకంగా త్వరలో సీఆర్ఓ వద్దకు మార్చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 లో భక్తులకు అందించే ఉచిత లడ్డులో కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారా అక్రమాలను అరికట్టినట్లు తెలిపారు. తద్వారా వ్యక్తి లేకుండా లడ్డు టోకెన్ రాదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు.
"ఫేస్ రికగ్నిషన్ వల్ల దళారి వ్యవస్థ తగ్గింది. వసతి గదుల కేటాయింపు మూడు రెట్లు పెరిగింది. కేవలం 5 నుంచి పది నిమిషాల్లో భక్తులకు గదుల కేటాయిస్తున్నాం. కాషన్ డిపాజిట్ మనీ ఇప్పుడు అటెండర్ తీసుకునేవాళ్లు, కానీ ఇప్పుడు అది టీటీడీకి చేరుకుంది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని భక్తులు కూడా ఫేస్ రికగ్నిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే గది తీసుకుంటారో వాళ్లే మళ్లీ కాషన్ డిపాజిట్ కోసం వెళ్లాల్సిఉంటుంది." -ఈవో ధర్మారెడ్డి
ఉచిత లడ్డు జారీ విధానంలోనూ
తిరుమలలో మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ప్రవేశపెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. గదుల కేటాయింపు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద ఈ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫొటో ఆధారిత బయోమెట్రిక్ అమలుతో దళారులకు అడ్డుకట్ట వేస్తుంది. గదుల కేటాయింపు సమయంలో ఫొటో క్యాప్చర్ తీసుకుంటున్నారు. గదులు ఖాళీ చేసే సమయంలో క్యాప్చర్ అయినా ఫొటో మ్యాచ్ అయితేనే కాషన్ డిపాజిట్ అకౌంట్ లో జమ చేస్తారు. రూమ్ రొటేషన్ విధానం ఆగిపోవడంతో త్వరిత గతిన సామాన్య భక్తులకి గదులు త్వరగా అందించగలుతోంది. గతంలో దళారుల చేతివాటంతో గదుల రొటేషన్ విధానం సాగుతూ వచ్చిన.... ఇప్పుడు ఫొటో ఆధారిత బయోమెట్రిక్ ద్వారా దళారులు గదులు పొందే అవకామే లేదు. ఉచిత లడ్డు జారీ విధానంలో సైతం ఫొటో ఆధారిత బయోమెట్రిక్ ప్రవేశపెట్టామని, లడ్డు మిస్యూస్ కాకుండా ఉండేందుకు ఈ విధానం పనిచేయనుంది అధికారులు తెలిపారు.