Divya Darshan Tickets : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీని పునరుద్దరిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో వేసవి ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అలిపిరి కాలినడక మార్గంలో 10 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాబోవు మూడు నెలలు పాటు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. వేసవి రద్దీ నేపథ్యంలో మూడు నెలలు పాటు ప్రజాప్రతినిధులు సిపారస్సు లేఖలను జారీ చెయ్యొద్దని విజ్ఞప్తి చేయ్యడంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు, ఆన్ లైన్ ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాతో పాటు టూరిజం శాఖకు కేటాయించే టిక్కెట్లను కుదిస్తున్నామ్మన్నారు. 


ఆర్బీఐకి రూ. 3 కోట్ల ఫైన్ చెల్లించాం


తిరుమల కొండపై 40 వేల మంది భక్తులకే మాత్రమే వసతి సౌకర్యం కల్పించే అవకాశం ఉందని, ఇందులో 80 శాతం గదులను సామాన్య భక్తులకు కేటాయిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రద్దీకి అనుగుణంగా భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేస్తామని, కల్యాణకట్టలను 24 గంటలు భక్తులకి అందుబాటులో ఉంచుతామన్నారు. విదేశీ భక్తులు సమర్పించిన వివిధ దేశాల కరెన్సీ 30 కోట్ల రూపాయిలు టీటీడీ వద్ద నిల్వ ఉందని, 2018లో టీటీడీ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ కాలపరిమితి ముగియడంతో కొద్ది సంవత్సరాలు తరువాత ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ కి దరఖాస్తూ చేస్తే, కేంద్ర హోం శాఖ లైసెన్స్ రెన్యువల్ కోసం రూ.3 కోట్లు ఫైన్ వేసిందని తెలిపారు. కొద్దీ రోజుల క్రితమే అపరాధ రుసుముని చెల్లించామని, త్వరలోనే లైసెన్స్ రెన్యువల్ అవుతుందన్నారు. టీటీడీ వద్ద నిల్వ ఉన్న విదేశీ కరెన్సీని పూర్తిగా మార్పిడి చేస్తామని చెప్పారు. 


ఏప్రిల్ 1 నుంచి దివ్యదర్శనం టోకెన్లు 


"తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు టోకెన్లు, వేసవిలో భక్తుల రద్దీ విషయాలపై సభ్యులతో చర్చించాం. అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా కాలినడకన వచ్చే భక్తులు దివ్య దర్శనం టోకెన్ల విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించాం. కోవిడ్ కారణంగా కొంత కాలం ఈ టోకెన్లు నిలిపివేశాం. ఇప్పుడు మళ్లీ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తున్నాం. అలిపిరి నుంచి వచ్చే భక్తులు 10 వేల మందికి, శ్రీవారి మెట్టు నుంచి వచ్చే భక్తులు 5 వేల మందికి దివ్య దర్శనం టోకెన్లు జారీచేస్తున్నాం. వేసవిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీఐపీలు, సిఫార్సులు లేఖలు తగ్గించుకోవాలని కోరుతున్నాం. తిరుమలలో వసతి గదులు 80 శాతం సామాన్య భక్తులకే కేటాయిస్తున్నాం. తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ  వల్ల గదుల కేటాయింపు పారదర్శంగా జరుగుతుంది. వేసవిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా విసృత్త ఏర్పాట్లు చేస్తున్నాం. మాడ వీధుల్లో చల్లటి పాయింటింగ్, చలువపందిళ్లు, తాగునీరు ఏర్పాటు చేస్తున్నాం. వేసవిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తాం.  " - వైవీ సుబ్బారెడ్డి