Tirumala : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో వైవీ.సుబ్బారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. అన్న ప్రసాదం రుచి, నాణ్యత, వడ్డిస్తున్న విధానం గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. కల్యాణ కట్ట, దర్శనం, వసతికి సంబంధించి ఎవరైనా డబ్బులు అడిగారా అని టీటీడీ ఛైర్మన్ ఆరా తీశారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఛైర్మన్ అధికారులను ఆదేశించారు. శ్రీవారి సేవకులతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి, వారికి వసతి, సేవ పొందిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుబ్బారెడ్డి భక్తులతో కలసి భోజనం చేశారు. 


27న తిరుమలకు సీఎం జగన్ 


టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల సెప్టెంబరు 27వ తేదీ‌ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. గత రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు కోవిడ్‌ కారణంగా నిర్వహించలేక పోయామని, ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని తనిఖీ చేసి భక్తులతో కలిసి భోజనం స్వీకరించామన్నారు. భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవల గురించి అడిగితే అత్యంత అద్భుతంగా సేవలు ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారన్నారు. స్వామి వారి దర్శన విషయంలో త్వరగా భక్తులకు దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ‌నెల 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, వాహన సేవలో పాల్గొంటారన్నారు. తర్వాత రోజు నూతన పరకామణి భవనాన్ని సీఎం‌ ప్రారంభించనున్నారని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రజాప్రతినిధులు, పాలక మండలి‌ సభ్యులు, అధికారుల సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేశామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా  వైవీ.సుబ్బారెడ్డి కోరారు.  


శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్..



  • సెప్టెంబరు 27 - సాయంత్రం 5.45 నుంచి 6.15  గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహనం

  • సెప్టెంబరు 28 - ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహన సేవ

  • సెప్టెంబర్ 29 - ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు సింహ వాహనం, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహనం

  • సెప్టెంబర్ 30 - ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహనం

  • అక్టోబర్ 1 - ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారం, రాత్రి 7 నుంచి గరుడ వాహన సేవ

  • అక్టోబర్ 2 - ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు ర‌థ‌రంగ డోలోత్సవం, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు గజ వాహన సేవ 

  • అక్టోబర్ 3 - ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనం 

  • అక్టోబర్ 4 - ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు అశ్వ వాహన సేవ

  • అక్టోబర్ 5 - ఉదయం 6 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం, రాత్రి 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం



  •