TTD Board Meeting :అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువై తిరుపతి నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. బ్రిటీష్ పాలన నాటి నుంచి నేటి వరకూ శ్రీనివాసుడి దేవస్థానం పరిపాలన అవసరాలకు అనుగుణంగా పాలకమండలి నియామకం చేపడుతారు. ప్రస్తుతం పాలక మండలి ఏర్పాటు ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వ అధికారులు నియామకం చేపడుతారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య క్రమేపి పెరుగుతున్న నేపథ్యంలో స్వామి వారి దర్శనాలు, సేవలకు ఎనలేని డిమాండ్ ఉంటుంది. ఇక శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని ఒక్కసారైనా దర్శించుకుంటే సరిపోదు. నిత్యం ఆయన సేవలోనే తరిస్తే ఎంత బాగున్నో అనే భావన ప్రతి భక్తుని‌ మనస్సులో కోర్కేగా మిగిలి పోతుంది. శ్రీనివాసుడిని ఎన్ని సార్లు దర్శించినా మళ్లీ మళ్లీ ఆ భాగ్యం దక్కుతుందా అనే భావన ప్రతి ఒక్కరిలో రావడంతోనే ఇంత డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం లక్షలాది సంఖ్యలో భక్తులు తిరుమల పుణ్యక్షేత్రానికి వస్తుంటారు. 


ఇలా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీ అధికారులు, పాలక మండలిపై ఉంటుంది. అందుకే ప్రతి రెండు నెలలకు ఓ సారి టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించి భక్తులకు సౌకర్యాలకు అవసరమయ్యే నిధులు, ఖర్చులపై చర్చిస్తారు. ఇందుకు అవసరం అయ్యే అజెండాను టీటీడీ పాలక మండలి అందిస్తారు. 


పాలక మండలి సమావేశం 


తిరుమలలో సోమవారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పాలక మండలి సమావేశం జరగనుంది. రేపు ఉదయం 10 గంటలకు తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరుగనున్న ఈ సమావేశానికి పాలకమండలి సభ్యులు అందరూ హాజరుకానున్నారు. ఈ పాలక మండలి సమావేశంలో దాదాపు 75 అంశాలపై చర్చించి నిర్ణయం‌ తీసుకోనుంది.  ఇందులో‌ ప్రధానంగా టీటీడీ ఉద్యోగులకు ప్రమాదాలపై భద్రత కల్పించడం, వారందరికీ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందేలా ఏర్పాటు చేయటం, శ్రీవారి భక్తుల కోసం టైం స్లాట్ టికెట్లు మంజూరు, నూతనంగా పార్వేట మండపంలో నూతన మండపం నిర్మాణం వంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయం వెలుపల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై టీటీడీ పాలక మండలిలో సభ్యులు చర్చించనున్నారు. 


వీటిపై చర్చ 


ఉత్సవాల నిర్వహణకు నిధులు కేటాయింపు, శ్రీవారి పోటు ఆధునీకరణ, ఈ ఏడాది చివరికి శ్రీనివాస సేతును పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులో తీసుకురావడంతో పాటు నిర్మాణానికి నిధులు కేటాయింపుపై చర్చ జరగనుంది. శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ సేవను శాశ్వత రద్దుపై చర్చ, తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్ ను మోడ్రన్ స్కూల్ గా మార్పునకు నిధులు మంజూరు చేయనున్నారు. శ్రీవారి ఆనంద నిలయం గోపురానికి బంగారు తాపడం, డాలర్ శేషాద్రి నివసించిన గృహాన్ని మ్యూజియంగా మార్చేందుకు చర్చ, శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలో పలు చోట్ల ఆలయాలు నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు టీటీడీ పాలక మండలిలో చర్చించనున్నారు.