TTD Board Meeting : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం శనివారం జరిగింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్ లో పాలక మండలి భేటీ అయింది. ఈ భేటీలో 65 అంశాలపై చర్చించిన పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  వేసవి సెలవుల్లో భక్తుల రద్దీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలు తగ్గించాలని నిర్ణయించింది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రత్యేక దర్శనాలు కుదించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నడకదారి భక్తులకు దర్శన టికెట్లు కేటాయిస్తున్నామన్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు, కళ్యాణం విజయవంతంగా జరిగాయని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.  లడ్డు ప్రసాదం తయారీకి కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన పంటలు ఉపయోగించాలని  నిర్ణయం తీసకున్నారు. దీని కోసం ధరలపై పాలకమండలిలో చర్చించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.


గంగమ్మ ఆలయానికి రూ3.12 కోట్లు 


"టీటీడీ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ ఆధునీకరణకి రూ.14 కోట్లు కేటాయించాలని నిర్ణయించాం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి రూ3.12 కోట్లు కేటాయిస్తాం. తిరుపతి విద్యాసంస్థలలో కాంట్రాక్ట్ సిబ్బంది కొనసాగిస్తూ, అవసరమైన శాశ్వత ఉద్యోగుల నియమించాలని నిర్ణయించాం. దిల్లీ ఎస్వీ కాలేజ్ లో ఆడిటోరియం అభివృద్ధి 4.13 కోట్లు కేటాయించాం. దిల్లీలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తరహా మే నెల 3 నుంచి 16 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. తిరుపతిలో శ్రీనివాస సేతు త్వరగా పూర్తి చేయాలని, అవసరమైన నిధులు మంజూరు చేయాలని నిర్ణయించాం. సాంకేతిక కారణంగా ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం అవుతుంది. విదేశీ కరెన్సీ మార్పిడికి అనుమతులు వచ్చాయి. పారిన్ కరెన్సీ పై వచ్చే వడ్డీపై కూడా సమాచారం ఇవ్వాలని కేంద్రం కోరింది." -  వైవీ.సుబ్బారెడ్డి,  టీటీడీ పాలక మండలి ఛైర్మన్ 


12 రకాల ఉత్పత్తుల కొనుగోలు 


శ్రీ పద్మావతి వైద్య కళాశాలలో రూ.53.62 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్లు పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని స్విమ్స్‌ పరిధిలో గల శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాలలో టీబీ, చెస్ట్, స్కిన్ ఇతర ఐసోలేషన్ వార్డులు, స్టాఫ్ క్వార్టర్స్, హాస్టళ్ల నిర్మాణ పనుల కోసం రూ.53.62 కోట్లు మంజూరు చేశామన్నారు. టీటీడీ అవసరాలకు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు ధరల నిర్ణయంపై రైతు సాధికార సంస్థ, మార్క్  ఫెడ్ తో చర్చించేందుకు  టీటీడీ బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సనత్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. అలిపిరి  మార్కెటింగ్‌ గోడౌన్‌ వద్ద నూతన గోడౌన్ల నిర్మాణానికి రూ.18 కోట్లు, కోల్డ్‌ స్టోరేజి నిర్మాణానికి రూ.14 కోట్లు టీటీడీ మంజూరు చేసిందన్నారు. గుంటూరుకు చెందిన దాత ఆలపాటి తారాదేవి రూ.10 లక్షలతో వెండి కవచాన్ని శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి అందించేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఆధునీకరణ పనులకు రూ.3.12 కోట్లతో టెండరుకు ఆమోదం ముద్ర వేశారు. 


రూ. 3 కోట్లు చెల్లింపులు 


 ఎఫ్.సి.ఆర్.ఏ (విదేశీ విరాళాల స్వీకరణ చట్టం) ప్రకారం విదేశీ భక్తుల నుంచి విరాళాలు స్వీకరించడానికి టీటీడీకి అనుమతి ఉందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  ఈ అనుమతి 2020 జనవరికి ముగిసిందని చెప్పిన ఆయన...దీనిని రెన్యువల్ చేసుకోవడానికి టీటీడీ దరఖాస్తు చేసిందని గుర్తు చేశారు. పలు దఫాలుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించామన్నారు. ఎఫ్.సి.ఆర్.ఏ, రాష్ట్ర దేవాదాయ శాఖ చట్టాల మధ్య ఉన్న సాంకేతిక కారణాల వల్ల విరాళాల డిపాజిట్లపై వచ్చే వడ్డీని చూపించడంలో కొన్ని అభ్యంతరాలు తెలిపారని ఇది సాంకేతిక కారణం మాత్రమేనన్నారు. ఎఫ్.సి.ఆర్.ఏ అధికారుల సూచన మేరకు త్వరగా లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.3 కోట్లు చెల్లిస్తామన్నారు.  ఇందుకోసం చెల్లించిన రూ.3 కోట్ల సొమ్మును తిరిగి పొందడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.