Tirumala Vasanthotsavam : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపుచేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండో రోజు ఏప్రిల్ 4న భూదేవి సమేత మలయప్పస్వామివారు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 5న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి  చేరుకుంటారు. 


వసంత రుతువులో 


ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.  వసంత రుతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి 'వసంతోత్సవ'మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 4న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.


నేటి నుంచి దివ్య దర్శనం టోకెన్లు జారీ


టీటీడీ ఇవాళ్టి నుంచి దివ్యదర్శనం టోకెన్ల జారీ తిరిగి ప్రారంభించింది. కొండపైకి నడిచి వెళ్లే భక్తుల కోసం దివ్య దర్శనం టికెట్లను వారం రోజుల పాటు జారీ చేయనుంది. ఈ ప్రయోగాత్మక ప్రక్రియలో లోపాలను సవరించి తర్వాత పూర్తిస్థాయిలో జారీ చేసే విధానం తీసుకురానున్నారు. అలిపిరి కాలిబాట మార్గంలో పదివేల టికెట్లు, శ్రీవారి మెట్టు దారిలో ఐదువేల టికెట్లు జారీ చేయనున్నారు.  తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతం నువ్వుల గింజలతో ప్రసాదంను నివేదిస్తారు అర్చకులు. శుక్రవారం రోజున 61,425 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 26,430 మంది తలనీలాలు సమర్పించగా.. 3.01 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 14 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 14 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది.