Lunar Eclipse : నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా 11 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తామని టీటీడీ తెలిపింది. చంద్రదర్శనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు. నవంబర్ 7న సిఫార్సు లేఖలు స్వీకరించమని తెలిపారు. చంద్ర గ్రహణం కారణంగా నవంబరు 8న మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు 11 గంటల పాటు శ్రీవారి ఆలయం తలుపులు మూసి ఉంచుతారు. మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. చంద్రగ్రహణం కారణంగా శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు.
కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం
ఖగోళ, జోతిష్య శాస్త్రాల్లో సూర్య, చంద్ర గ్రహణాలకు చాలా ప్రాధాన్యం ఉంది. గ్రహణాలను ప్రత్యక్షంగా చూసేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. జోతిష్య శాస్త్రాన్ని పాటించే వారు గ్రహణాలను అరిష్టంగా పరిగణిస్తున్నారు. ఈ గ్రహణాలు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని జోతిష్య శాస్త్రం చెబుతోంది. రానున్న రెండు నెలల్లో మరో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వాటిలో ఒకటి సూర్య గ్రహణం, మరొకటి చంద్ర గ్రహణం. ఈ మధ్యే ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం ముగిసింది. నవంబరు 8 కార్తీక పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఉంది.
2022 నవంబరు 8 మంగళవారం చంద్రగ్రహణం
శ్రీ శుభకృత్ నామసంవత్సరం మార్గశిర శుద్ధ పూర్ణిమ నవంబరు 8 మంగళవారం భరణి నక్షత్రం మూడో పాదంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం పడుతుంది.
- స్పర్శ కాలం మధ్యాహ్నం - 2 గంటల 38 నిముషాలు
- మధ్య కాలం మధ్యాహ్నం - 4 గంటల 28 నిముషాలు
- మోక్ష కాలం మధ్యాహ్నం - 6 గంటల 18 నిముషాలు
- ఆద్యంత పుణ్యకాలం 3 గంటల 40 నిముషాలు
ఈ గ్రహణం భరణి నక్షత్రం మేషరాశిలో పట్టడం వల్ల అశ్విని, భరణి, కృత్తిక నక్షత్ర జాతకులు... మేష రాశివారు ఈ గ్రహణం చూడరాదు. చంద్రోదయం సాయంత్రం 5 గంటల 27 నిముషాలకు అవుతుంది. అందుకే విడుపు సమయంలో 51 నిముషాలు మాత్రమే ఈ గ్రహణం కన్పిస్తుంది. నియమాలు పాటించే గర్భిణి స్త్రీలు కూడా సాయంత్రం 5.27 నుంచి 6.18 వరకు కదలకుండా పడుకుంటే చాలు.
Also Read : Chandra Grahan 2022: నవంబరు 8 కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం, ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే!