Tirumala News : భక్తులకు టీటీడీ అధికారులు కీలక అప్ డేట్ ఇచ్చారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో వృద్ధులు, చిన్న పిల్లల త‌ల్లిదండ్రులు, వికలాంగులు తిరుమ‌ల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వ‌ర‌కు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని టీటీడీ అంచనా వేస్తోంది.  భ‌క్తులకు దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ కోరుతోంది.


వరుస సెలవులతో రద్దీ 


వేసవి రద్దీ తగ్గినప్పటికీ, వారాంతం రద్దీతో పాటు వ‌రుస సెలవులు ఆగస్టు 19 వరకు కొనసాగుతాయి.  పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబర్ 18న‌ ప్రారంభమై అక్టోబర్ 17వ తేదీ ముగుస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో తిరుమ‌ల యాత్రికుల ర‌ద్దీ అనూహ్యంగా పెరిగింది. ఈ కార‌ణంగా వృద్ధులు, చిన్న పిల్లల త‌ల్లిదండ్రులు, వికలాంగులు తిరుమ‌లకు పెరటాసి మాసం అనంతరం రావలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. అధిక రద్దీ ఉన్న రోజుల్లో యాత్రికులను నిర్దేశిత సమయాలలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని తెలిపింది. యాత్రికులు దర్శనం కోసం తమ వంతు వ‌చ్చే వరకు కంపార్ట్‌మెంట్లలో, క్యూ లైన్లలో చాలా గంటలు వేచి ఉండటానికి సిద్ధపడి రావాలని టీటీడీ కోరింది.  


దర్శనాల సమయాల్లో మార్పులు 


తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సోమవారం స్వామి వారిని 74,830 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,405 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ.4.79 కోట్ల ఆదాయం లభించింది. సర్వదర్శనానికి 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండడంతో పాటు బయట క్యూలైన్స్ లో 2 కిలోమీటర్ల మేర భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశదర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. నేడు(మంగళవారం) ఆలయంలో రెండో రోజు పవిత్రోత్సవాలు సందర్భంగా దర్శన వేళల్లో మార్పులు చేసింది టీటీడీ. దీంతో దర్శనం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని టీటీడీ ప్రకటించింది.


శ్రీవారి కైంకర్యాలు 


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారం తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు  ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీనివాసమూర్తికి దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు.  నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ఆరాధనలో భాగంగా మొదటి నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.  


మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు 


సన్నిధిలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శనం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండో గంట నివేదన అనంతరం ప్రతి మంగళవారం నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" సేవను పవిత్రోత్సవాల కారణంగా టీటీడీ రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. రెండో రోజు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం జరగకూడదని ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 8వ తారీఖు నుంచి  మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు కొనసాగిస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా రెండో రోజు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. తరువాత రెండో రోజు పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. 


మాడ వీధుల్లో శ్రీనివాసుడు 


సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శన‌ం ఇవ్వనున్నారు. స్వామి వారి ఉత్సవ మూర్తులు శ్రీవారి ఆలయం చేరుకున్న అనంతరం సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనానికి భక్తులను అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.  ఇక ప‌విత్రోత్సవాల్లో భాగంగా ఇవాళ అష్టద‌ళ పాద‌ ప‌ద్మారాధ‌న‌తో పాటుగా, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.