Minister Meruga Nagarjuna: ఏంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వివాదం విషయమై ఇంకా రచ్చ నడుస్తూనే ఉంది. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నాయకులే చేస్తున్నారంటూ రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీలను అణగదొక్కేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎంపీ గోరంట్ల మాధవ్ ఫొటోను మార్ఫింగ్ చేసి వీడియో సృష్టించినట్లు చెప్పారు. ఈ వీడియో పూర్తిగా అబద్ధం అని మంత్రి వివరించారు. ఈ విషయమై గోరంట్ల మాధవే నేరుగా తన ఫొటో మార్ఫింగ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మేరుగు నాగార్జున పేర్కొన్నారు. 


ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పారిపోయాడు..


విచారణలో పూర్తి విషయాలు బయటకు వస్తాయని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మార్ఫింగ్ చేశారా లేదా తేలడానికి గంట‌ సమయం సరిపోతుందని టీడీపీ శ్రేణులు, పచ్చ మీడియా చెబుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు వాయిస్ నిర్థారణ ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ కాలేదో అర్థం కావడం లేదన్నారు. అడ్డంగా దొరికిపోయిన తరువాత చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి పారిపోయి వచ్చారని.. ఇలాంటి ఓ వ్యక్తి నీతులు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని సెటైర్లు వేశారు. నారా లోకేష్ ఫొటో మార్ఫింగ్ చేసి.. అర్ధ నగ్నంగా తయారు చేసి అమ్మాయిలతో బీచ్ లో డ్యాన్సులు వేసినట్లు వీడియో తీసుకొస్తే మీకు సమ్మతమేనా అని అడిగారు. ఒకవేళ విచారణలో గోరంట్ల మాధవ్ తప్పు‌ చేశాడని తెలితే.. కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. 


అసలే జరిగిందంటే..?


వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడుతున్నట్లున్న ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఉదయం 8 గంటల సమయంలో ఈ వీడియో కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కాసేపట్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై గోరంట్ల మాధవ్ స్పందిస్తూ ఆ వీడియో నకిలీదని అన్నారు. తాను జిమ్ లో కసరత్తు చేస్తున్న వీడియోను మార్ఫింగ్ చేశారని చెప్పారు. ఇది టీడీపీ నేతల కుట్రేనని ఆరోపించారు. అలాగే ఈ వీడియోను అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయ విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ తదితరులు విడుదల చేశారని ఆరోపించారు. దీనిపై స్పందించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాత్రుడు.. ఎంపీ గోరంట్లపై పరువు నష్టం దావా వేశారు. తనపై చేసిన ఆరోపణలు మాధవ్ నిరూపించాలని డిమాండ్ చేస్తూ 50 లక్షల మేర పరువు నష్టం దావా వేశారు.


నిన్నటికి నిన్నవీడియోలో ఉన్న మహిళ ఈమేనంటూ చాలా ఫొటోలను మాధవ్‌ ప్రత్యర్థులు ప్రచారం చేశారు. ఇందులో తనకు సంబంధం లేదంటూ ఓ మహిళ బయటకు వచ్చి మొర పెట్టుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి, జగన్‌కు మద్దతుగా ఉన్నామన్న కక్షతోనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుంచే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.