Tirumala : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. కరోనా అనంతరం రెండేళ్ల తర్వాత మాఢవీధుల్లో వాహనసేవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. తిరుమల అన్నమయ్య భ‌వ‌నంలో ఇవాళ నిర్వహించిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమంలో ఈవో ధర్మారెడ్డి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా ఫోన్ ద్వారా భక్తుల ప్రశ్నలకు సమాధానం తెలిపిన అనంతరం మీడియాతో మాట్లాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సెప్టెంబరు 27 సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం చేస్తారన్నారు. 


490 ఓపెన్ హార్ట్ సర్జరీలు 


అక్టోబరు 1వ తేదీన గరుడ వాహనం, 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం నిర్వహిస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలో ప్రారంభించిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలంలో ఇప్పటి వరకు 490 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశారని వెల్లడించారు. ఇక్కడి డాక్టర్లు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ఇటీవల 7 రోజుల పసికందుకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్స చేశారన్నారు. ఈ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రెండు సంవత్సరాల్లో శ్రీ పద్మావతి పీడియాట్రిక్  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. సృష్టిలోని జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ షోడశదినాత్మక అరణ్యకాండ పారాయణ దీక్ష చేపట్టామన్నారు. జూన్‌ 25న ప్రారంభమైన ఈ దీక్ష జులై 10న పూర్ణాహుతితో ముగుస్తుందని తెలిపారు. 


శ్రీవారికి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు 


గోఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి నైవేద్యం, ఇతర ప్రసాదాలు తయారుచేసేందుకు వీలుగా రెండో విడతలో 12 రకాల ఉత్పత్తులు సేకరించేందుకు రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌లతో ఒప్పందం చేసుకున్నాం‌మని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు తిరుపతిలోని గోశాలను సంప్రదించి ఉచితంగా గోవులు, ఎద్దులను పొందవచ్చు అన్నారు. ఇక తిరుమలలో జులై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరగనుందని తెలిపారు. 


బ్రేక్ దర్శనాలు రద్దు


శ్రీవారి భక్తులకు టీటీడీ అప్‌డేట్ ఇచ్చింది. తిరుమలలో ఒక్కరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 12న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో జూలై 11న విఐపి బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని స్పష్టం చేశారు. జూలై 17 న ఆదివారం అస్థానం సందర్బంగా తిరుమల శ్రీ‌వారి ఆలయంలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా జూలై 12న విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేయడం జరిగిందని, ఈ కారణంగా జూలై 11న‌ విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని తెలిపింది. కావున  భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.