Tirumala Snake : తిరుమలలోని పురోహిత సంఘం వద్ద పాము హల్ చల్ చేసింది. ఆరు అడుగుల నాగుపాము బుసలు కొడుతూ భక్తులను భయపెట్టింది. పామును చూసిన భక్తులు, సిబ్బంది  పరుగులు తీశారు. అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. పురోహిత సంఘం వద్దకు చేరుకున్న భాస్కర్ నాయుడు పామును పెట్టే ప్రయత్నం చేశారు. తోకను ముట్టుకోగానే పడగవిప్పిన నాగు కాటు వేసే ప్రయత్నం చేసింది. పాటు కాటు నుంచి భాస్కర్ నాయుడు తృటిలో తప్పించుకున్నారు. కొంత సేపు పామును రోడ్డుపై పడగ విప్పుకొని ఉండటంతో  అక్కడ ఉన్న సిబ్బంది సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. రెండో సారి కూడా కాటు వేసే ప్రయత్నం చేసింది. అనంతరం భాస్కర్ నాయుడు చాకచక్యంగా పామును పట్టుకొని అవ్వాచారి కోణలో విడిచిపెట్టారు. కొన్ని రోజుల క్రితం భాస్కర్ నాయుడు పాము కాటుకు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కోలుకున్న తర్వాత మళ్లీ తన డ్యూటీ మొదలుపెట్టేశారు. 


షూలో నక్కిన నాగు


వర్షాకాలం వస్తే చాలు.. ఏ పాము ఎక్కడి నుంచి వస్తుందోనని భయపడుతుంటారు జనాలు. అలాంటిది ఏకంగా పాము.. షూలో తలదాచుకుంటే పరిస్థితేంటి? అవును తాజాగా అలాంటి ఘటనే జరిగింది. చెప్పుల స్టాండులో ఉన్న షూలో ఓ నాగుపాము ముడుచుకొని పడుకుంది. తన చెప్పుల స్టాండులో నుంచి షూ వేసుకునేందుకు వచ్చిన ఓ మహిళకు అందులో లోపల నాగుపాము ముడుచుకొని పడుకొని ఉండటం చూసి షాక్‌కు గురైంది. వెంటనే ఓ ఇనుప రాడ్‌ను షూ లోపల నెట్టడంతో నాగుపాము పడగ విప్పి మహిళను కాటు వేసేందుకు ప్రయత్నించింది. చివరికి ఎలాగోలా ఆ పామును బయటకు పంపారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద షూలో పడుకున్న నాగుపాము వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.  క్యాప్షన్‌లో వర్షాకాలంలో పలు ప్రదేశాలలో పాములు కనిపిస్తాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. షూలోపల నాగుపాము పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు తమ జీవితంలో పామును చూసిన ఘటనల గురించి కామెంట్లు పెడుతున్నారు. వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.