Tirupati News : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగసభ కోసం శ్రీకాళహస్తిలో బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన దేశాభివృద్ధిని వివరించేందుకు ఏర్పాటు చేసిన బహిరంగసభ శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం వద్ద జరగనుంది. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానుండడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా సభ ఏర్పాట్లు చేస్తున్నాయి. బీజేపీ అగ్ర నేతలు సోమువీర్రాజు, పురందేశ్వరి, సుజనా చౌదరి, కిరణ్‌కుమార్ రెడ్డి,సీఎం రమేష్, జీవీఎల్ నరసింహా రావు, టీజీ వెంకటేశ్, విష్ణువర్ధన రెడ్డి కొద్ది రోజుల నుంచి తిరుపతిలోనే మకాం వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు.
శుక్రవారం రాత్రి 11గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకున్న జేపీ నడ్డాకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన వెంట తిరుమల వెళ్లారు.శ్రీకృష్ణ గెస్ట్‌హౌస్‌లో బసచేసిన నడ్డా శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో జెపి నడ్డా స్వామి వారి సేవలో పాల్గొనిమొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నడ్డాకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నడ్డాతో పాటు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, సుజనా చౌదరి, సిఎం రమేష్ లు ఉన్నారు. ఆలయం వెలుపల మీడియాతో నడ్డా మాట్లాడుతూ..... శ్రీ వెంటేశ్వరుడంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయన్నారు. దేశంలో శాంతి., సంపూర్ణ అభివృద్ది సాధించేలా భగవంతుడు శక్తిని ఇవ్వాలని ప్రార్ధించానని తెలిపారు. ప్రజలంతా స్వామి వారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నానన్నారు. భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందేలా దీవించాలని ప్రార్ధించినట్లు చెప్పారు.
జేపీ నడ్డా సభకు భారీ జన సమీకరణ చేయడానికి బీజేపీ నేతలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటికి తిరిగి చేస్తున్న ప్రచారంతో .. మోదీ పాలనా విజయాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీంతో స్వచ్చందంగా వచ్చే వారు కూడా ఎక్కువగా ఉంటారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రాయలసీమలో బీజేపీకి బలమైన నేతలు ఉన్నారు. వారందరూ నడ్డా సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. శ్రీకాళహస్తి సభ తర్వాత ముఖ్యనేతలంతా విశాఖపట్నం అమిత్ షా సభ కూ హాజరవుతారు.