Nayanatara Vignesh Wedding : శ్రీవారి కల్యాణోత్సవ సేవలో నూతన దంపతులు నటి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ పాల్గొన్నారు. నయనతార దంపతులు పెళ్లైన తర్వాత నేరుగా తిరుమలకు స్వామి వారి దర్శనానికి వచ్చారు. వివాహబంధంతో ఒక్కటైనా నయనతార విఘ్నేష్ దంపతులు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  దాంపత్య జీవితంలో అడుగు పెట్టిన సినీ జంట నేరుగా తిరుమలకు చేరుకొని స్వామి వారి కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించిన అనంతరం వేంకటేశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. 


కల్యాణోత్సవంలో నయనతార దంపతులు 


తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన నయనతార దంపతులకు ఫొటో సూట్ వివాదం చుట్టుకుంది. నూతన దాంపత్య జీవితంలో అడుగు పెట్టిన నయనతార విఘ్నేష్ శివన్ లు నేరుగా శ్రీనివాసుడి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చారు. అలా వచ్చిన నయనతార దంపతులు స్వామి వారి కళ్యాణోత్సవ సేవలో పాల్గోన్నేందుకు నేరుగా ఓ బృందంతో మధ్యాహ్నం 12 గంటలకు కల్లా తిరుమలకు చేరుకున్నారు. నయనతార దంపతులు తిరుమలలోని ఎస్ఎంసీ కాటేజ్ వెనుక వైపు నుంచి సుపథం మార్గం చేరుకున్నారు. అయితే నయనతార దంపతులతో పాటుగా మొత్తం 26 మందిని టీటీడీ ఉద్యోగి సుపథం మార్గం ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా సామాన్య భక్తులతో పాటుగా శ్రీవారి ఆలయం తీసుకొచ్చారు. కల్యాణోత్సవ సేవలో కొంతసేపు గడిపిన నయనతార విఘ్నేష్ దంపతులు స్వామి వారి దర్శనంతరం ఆలయం బయటకు చేరుకున్నారు. 


ఫొటో షూట్ వివాదం


సాధారణంగా తిరుమలలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో పాదరక్షలు ధరించకూడదని షరతులు ఉన్నాయి. ఆలయ మహా ద్వారం గుండా బయటకు వచ్చిన నయనతార వెంటనే పాదరక్షలు ధరించి నడిచి వచ్చారు. ఆ సమయంలో నయనతార దంపతులను చూసిన భక్తులు ఒక్కసారిగా వారితో ఫొటోలు దిగ్గేందుకు ఉత్సాహం చూపారు. నయనతార రక్షణ కల్పించేందుకు వచ్చిన బౌన్సర్ లు భక్తులను పక్కకు నెట్టుతూ భయాందోళనకు గురి చేశారు. ఆలయం నుంచి వచ్చిన నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు శ్రీవారి పుష్కరిణికి అభిముఖంగా ఫొటోలకు ఫోజులిచ్చారు. శ్రీవారి ఆలయం ముందు నయనతార దంపతులు ఫోటో షూట్ చేశారు. ఇది అంతా ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ఆలయం ముందుగా నిర్వహించడంపై పలువురు భక్తులు మండిపడుతున్నారు. కలియుగ వైకుంఠనాధుడి విహరించే తిరుమాఢ వీధుల్లో సైతం నయనతార పాదరక్షణలు ధరించి నడిచారు. దీనిపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నయనతార ఎలా పాదరక్షలు ధరించి నడుస్తుందని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా తిరుమలలో సినీ బృందంతో కొన్ని ఫొటో షూట్ లు చిత్రీకరించారు. ప్రస్తుత్తం నయనతార ఫొటో షూట్ చర్చనీయంగా మారింది. తిరుమల పవిత్రత దెబ్బ తీసే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కఠినంగా వ్యవహరించే టీటీడీ నయనతార ఫొటో షూట్ వ్యవహారంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.