Minister Rk Roja : ఏపీలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఇప్పటం ఆక్రమణలపై ప్రజలకు ఆరు నెలల ముందే అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. ఏం ఉద్దరించడానికి ఇప్పుడు పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్తున్నారని మంత్రి రోజా పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. శనివారం శ్రీవారి కల్యాణోత్సవ సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న మంత్రి రోజా ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కళ్లు ఉన్న కబోది చంద్రబాబు అని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ నడుస్తున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకుంటున్నారన్నారు. ఇప్పటం గ్రామంలో రోడ్లు వేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయంలో జరిగిన అభివృద్ధి ఏమిటో, మూడున్నర సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చకు మీరు సిద్ధమా అంటూ మంత్రి రోజా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.


ముసుగు తొలగిపోయింది 


"పచ్చ కామెర్ల వారికి లోకం పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు చంద్రబాబు తీరు ఉంది. ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టే ఆయనను ప్రజలు తరిమికొట్టారు. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు కాబట్టే ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు వైసీపీని గెలిపిస్తున్నారు. ప్రజల గుండెల్లో స్థానం లేని పవన్ కల్యాణ్, చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. మూడు రాజధానుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. వీటిని చూసి సహించలేని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. పవన్, చంద్రబాబు ముసుగు తొలగిపోయింది. ఇద్దరు ప్లాన్ చేసుకుని డ్రామాలు ఆడుతున్నారు."- మంత్రి రోజా 


డిబేట్ కు రావాలని సవాల్ 


ఇప్పటంలో ఏం పని ఉందని పవన్ వెళ్తున్నారని మంత్రి రోజా ప్రశ్నించారు. ఇప్పటంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇచ్చారన్నారు. గ్రామస్థులు ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నోటీసులతో సహకరిస్తున్నారన్నారు. రోడ్డు వేయడంలేదని ఆరోపిస్తారు, ఇప్పుడు రోడ్లు వేస్తుంటే అడ్డుపడుతున్నారని రోజా మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనీయకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. గత మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి డిబేట్ కు రావాలని మంత్రి రోజా సవాల్ విసిరారు. 


పవన్ పై మంత్రి జోగి రమేష్ సెటైర్లు


పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన అసమర్థుడు వైసీపీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారని పవన్ పై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. విజయవాడలో మాట్లాడిన ఆయన ఇడుపులపాయలో హైవే అంటూ పవన్ పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. పవన్ ప్రజలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రెక్కీ, రాళ్ల దాడి, ఇప్పటం అంటూ జనసేన, టీడీపీ కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పటంలో ఒక్క ఇళ్లు కూడా కూల్చలేదని మంత్రి అన్నారు. గ్రామంలో రోడ్డు విస్తరణ పనులపై గ్రామస్థులు సంతోషంగా ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామానికి ఇస్తానన్న రూ.50 లక్షలు ఇవ్వాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. పవన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. నిన్నటి వరకూ రెక్కీ అంటూ డ్రామాలు ఆడారని తెలంగాణ పోలీసులు అలాంటిది ఏంలేదని తేల్చి చెప్పేసరికి మరో నాటకానికి తెరలేపారని విమర్శించారు. చంద్రబాబు వీకెండ్ లో అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్తే, పవన్ అమరావతికి వస్తున్నారని ఎద్దేవా చేశారు.