Minister Roja : పవన్ కల్యాణ్ చంద్రబాబులపై ఏపీ మంత్రి ఆర్.కె.రోజా మరోసారి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న మంత్రి రోజా సీఎం జగన్ పాలసీలను పొగుడుతూ, ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆలయం వెలుపల మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రమంతా సీఎం జగన్ అజెండాపై విస్తృతంగా చర్చ సాగుతోందని తెలిపారు. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనీ పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ సాగుతోందన్నారు. 58 ఏళ్ల ముందు రాయలసీమకు రావాల్సిన రాజధాని రాలేదని, ఐదు దశాబ్దాల అనంతరం రాయలసీమ ప్రజల కల సాకారం కానుందని మూడు రాజధానుల విధానానికి మద్దతు పలికారు. రాలయసీమ బిడ్డగా న్యాయరాజధాని కావాలని సీఎం జగన్ సంకల్పం, తన కోరికని తెలిపారు. విశాఖను రాజధాని పెట్టాల్సింది కానీ ఆ రోజుల్లో పెట్టలేకపోయామని పుచ్చలపల్లి సుందరయ్య అన్నారని, ఇప్పుడు ఆ కలను సాకారం చేస్తూ విశాఖను సీఎం పరిపాలన రాజధాని చేస్తున్నారని అన్నారు.
చంద్రబాబు చరిత్ర హీనుడు
రాయలసీమకు పరిపాలన రాజధాని వస్తుంటే, చంద్రబాబు ఆనందించాలి కానీ తన బినామీల పేరుతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు రాజధాని అమరావతిలోని ఉండాలని నీచ రాజకీయం చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోవడం ఖాయమని, రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులకు మద్దతు ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి పట్టంగట్టారని చెప్పారు. ప్రజల అభిప్రాయాలు పట్టించు కోకుండా పెయిడ్ ఆర్టిస్ట్ లతో అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, ఉత్తరాంధ్రకు అమరావతి నుంచి పాదయాత్ర చేయడం బాధాకరమనన్నారు. నిజమైన రైతులంటే ప్రతి రైతు కష్టం తెలుస్తుందని, 26 జిల్లాలోని రైతులకు న్యాయం కావాలని కోరుకుంటారని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తుంటే, చంద్రబాబు స్వార్థపరమైన పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, పవన్ కల్యాణ్ చంద్రబాబుకు వెన్నుదండుగా ఉంటూ ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయటకు వస్తారని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర సంఘీభావ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించడానికి పవన్ మూడు రోజులు విశాఖలో కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు.
పవన్ ఆ పుస్తకాలు చదవలేదా?
పిచ్చి కూతలు కూసి మీడియాను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పవన్ పై మంత్రి రోజా మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలకు పరిపాలన రాజధాని సెంటిమెంట్ ను దారిమళ్లించడానికి ఈ కార్యక్రమం అంటూ హేళన చేశారు. రాయలసీమ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలకు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నో పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకొనే పవన్ కి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల కష్టాల పుస్తకాలు చదవలేదా, చదివి తెలుసుకోమని హితవు పలికారు. అన్ స్టాపబుల్ షో లో బావబామ్మర్దులు కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పారని, ఎన్టీఆర్ ను పదవీ దాహంతో వెన్నుపోటు పొడిచి, పార్టీని లాక్కొని ఆయన మరణానికి కారణమయ్యారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ పై చెప్పులు విసిరి
అమాయకంగా మీరు నాతో ఉన్నారు. ఆయన కాళ్లు పట్టుకొని ఏడ్చాను అని అయినా ఆయన వినలేదు. నేను చేసింది తప్ప అని అడగటం ప్రజలను పిచ్చోళ్లు చేయాలనీ చూస్తున్నారని రోజా మండిపడ్డారు. వీళ్లే తింగరోళ్లు, ప్రజలు వీళ్లను చూసి నవ్వుకుంటున్నారని హేళన చేశారు. తన ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పడం దెయ్యలు వేదాలు వర్ణించినట్లు ఉందన్నారు. ఎన్టీఆర్ పై చెప్పులు విసిరి, పార్టీ నుంచి సస్పెండ్ చేసి, పార్టీ, పార్టీ గుర్తు లాక్కోని ఎన్టీఆర్ భవన్ పార్టీ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ ను బయటకు నెట్టేసి, ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చారని ఆరోపించాడు. ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని, కుప్పం ప్రజలను సైతం చంద్రబాబు మోసం చేశారన్నారు. పరిపాలన రాజధాని, న్యాయ రాజధానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పీకే, చంద్రబాబులను ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు.