Tirumala : మహారాష్ట్రీయులకు గర్వకారణమైన ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు అవమానం జరిగినట్లు ఓ భక్తుడు వీడియో క్లిప్ ద్వారా ఆరోపించడాన్ని టీటీడీ ఖండించింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల విగ్రహాలు, ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రచార సామగ్రి తిరుమలకు తీసుకువెళ్లడాన్ని టీటీడీ నిషేధించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన వాహనాన్ని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రతా సిబ్బంది నిలిపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది నల్లటి రంగులో ఉన్న ఒక ప్రతిమను గుర్తించి, ఆ ప్రతిమ ఛత్రపతి శివాజీదని తెలుసుకుని తిరుమలకు అనుమతించారు. దేవతామూర్తుల చిత్రాలు తప్ప, వ్యక్తుల విగ్రహాలు, రాజకీయ పార్టీల జెండాలు, ఇతర చిహ్నాలను ప్రదర్శించరాదని సదరు భక్తుడిని కోరారు. అయితే ఆ భక్తుడు శివాజీ మహారాజ్‌ను టీటీడీ అవమానించిందని ఆరోపిస్తూ తీవ్ర పదజాలంతో వీడియో రూపొందించి, ఇతరులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సోషల్ మీడియాలో ఉన్న వీడియోలోని విషయాలను టీటీడీ తీవ్రంగా ఖండించింది.
టీటీడీ ఏంచెబుతోందంటే?
తిరుమల ముఖ ద్వారంమైన అలిపిరి తనిఖీ కేంద్రంలో భక్తుల వాహనాలు తనిఖీ చేసే సమయంలో అప్రమత్తం ఉండాలని, దేవతామూర్తుల విగ్రహాలు, హిందూ ధార్మిక సంస్థల జెండాలను అనుమతించాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి విజిలెన్స్ సిబ్బందికి సూచించారు. కేవలం రాజకీయ నాయకుల ప్రతిమలు, జెండాలు, అన్యమతాలకు సంబంధించిన వస్తువులను కచ్చితంగా అలిపిరి వద్దే తొలగించాలని సూచించారు. దేశం నలుమూలల నుంచి తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు వాహనాలపై అన్యమత చిత్రాలు గానీ, జెండాలు గానీ ఉంచుకుని తిరుమల కొండకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
దశాబ్దాల కిందటే నిషేధం
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు తీసుకురావడాన్ని టీటీడీ నిషేధించింది. భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రచార సామగ్రి, తిరుమలకు తీసుకురావడాన్ని కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధం విధించారు. టీటీడీ భద్రతా సిబ్బంది అలిపిరి వద్ద వాహనాల తనిఖీలు చేసి ఇలాంటి అన్యమత ప్రచార సామాగ్రి ఉంటే తిరుమలకు అనుమతించరు. ఇది ఎన్నో దశాబ్దాలుగా అనుసరిస్తున్న నిబంధన అని టీటీడీ తెలిపింది. తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా లేక వ్యక్తుల ఫొటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలతో వస్తున్నారు. వీటిని విజిలెన్స్ సిబ్బంది వాహనదారులకు విషయం వివరించి తొలగిస్తున్నారు. వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.