Leopard Cub : తిరుపతి నుంచి తిరుమల వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో చిరుత పులి పిల్ల మృతి చెందింది. శుక్రవారం ఉదయం‌ వేకువజామున నాలుగు గంటల సమయంలో అలిపిరి సమీపంలోని వినాయక స్వామి వారి‌ ఆలయం వద్ద గుర్తు తెలియని‌ వాహనం‌ ఢీ కొనడంతో చిరుత పులి పిల్ల ఘటనా స్థలంలోనే మృతి చెందింది. అయితే విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ ‌సిబ్బంది అటవీ‌శాఖ అధికారులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలం వద్దకు చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి పిల్లకు పోస్టు మాస్టం కోసం తిరుపతి జూపార్క్ కు తరలించారు. చిరుత పులి పిల్లకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఖననం చేశారు.


చిరుత భయంతో హడలి పోతున్న ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు


తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ లో చిరుత భయంతో విద్యార్థులు వణికిపోతున్నారు. చీకటి పడితే చాలు చిరుతలు క్యాంపస్ లో తిరుగుతూ ఉండడంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు బయటికి రావాలంటే భయపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఎస్వీయూ వీసీ బంగ్లా భవనం ఆవరణలో చిరుత పులి కుక్కలను వేటాడిన దృశ్యం సీసీ ఫుటేజ్ లో నమోదైంది. వేటాడి చంపిన కుక్కను యూనివర్సిటీ ప్రహరీ గోడపైకి తీసుకెళ్లి తినేసింది. శేషాచలం అటవీ ప్రాంతానికి ఆనుకునే ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ ఉండడంతో తరచూ చిరుతలు క్యాంపస్ ఆవరణలో సంచరిస్తున్నాయి. క్యాంపస్ లో తిరిగే కుక్కలను వేటాడేందుకు చిరుతలు వస్తున్నాయి. ఇప్పటికైనా అటవీశాఖ సిబ్బంది తగిన చర్యలు తీసుకొని చిరుతల నుంచి రక్షణ కల్పించాల్సిందిగా విద్యార్థులు కోరుతున్నారు. 



అటవీ ప్రాంతంలో చిరుత విడుదల 


ఇటీవల హైదరాబాద్ శివారులో పట్టుకున్న చిరుతను అటవీ ప్రాంతంలో విడుదల చేశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మన్ననూరు రేంజ్ లో చిరుతను సురక్షితంగా విడుదల చేశారు అటవీశాఖ అధికారులు.  ఇటీవల హెటిరో డ్రగ్స్ ప్లాంట్ లో చొరబడిన చిరుతను పట్టుకుని జూపార్క్ కు తరలించారు. మూడు రోజుల పరిశీలన తర్వాత అటవీ ప్రాంతంలో విడుదల చేశారు. చిరుత ఆరోగ్యంగా ఉందని అటవీ అధికారులు తెలిపారు.  సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో ఉన్న హెటెరో పరిశ్రమలో చొరబడిన చిరుతను అటవీ అధికారులు పట్టుకున్నారు. గత శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పరిశ్రమలోకి చిరుత చొరబడిందని తెలిసిన వెంటనే.. సిబ్బంది అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు నాలుగు బోన్లతో మేక పిల్లలను ఎరగా వేసి.. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. సుమారు ఆరేడు గంటల ఆపరేషన్ తర్వాత..  చిరుతను విజయవంతంగా పట్టుకోలిగారు. ఇవాళ ఆ చిరుతను అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు అధికారులు.  


సూర్యపూర్ గ్రామ శివారులో చిరుతపులి మృతి


నిర్మల్ జిల్లా కుంటాల మండలం సూర్యాపూర్ గ్రామ శివారులో చిరుతపులి మృతి కలకలం రేపింది. సూర్యపూర్ గ్రామానికి చెందిన లింగన్న అనే రైతు ఇటీవల గ్రామంలోని చెరువు ప్రాంతం వద్ద చిరుత కళేబరాన్ని చూడడంతో భయాందోళనకు గురయ్యాడు. వెంటనే చిరుత గురించి గ్రామస్తులకు, సర్పంచ్ కు తెలియజేశాడు. అనంతరం గ్రామ సర్పంచ్ అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియజేయగా.. చిరుత కలేబరాన్ని అటవీ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. చిరుతపులి ఎలా మృతిచెందిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.