Tirumala: తిరుమలలో భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా తీవ్రత తగ్గుతుండడంతో ఆంక్షలు ఎత్తివేశారు. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. గత రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా శనివారం రికార్డు స్థాయిలో భక్తులు(Devotees) శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న 75,704 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 33,187 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం రూ.3.67 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. రెండు సంవత్సరాల తర్వాత శ్రీవారి(Srivari) సన్నిధిలో భక్తులు సందడి కనిపిస్తోంది. కరోనా(Corona) మొదలైన 2020 మార్చి నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు. దర్శనం టికెట్లు (Darshan Tickets) కూడా పరిమిత సంఖ్యలోనే జారీ చేస్తున్నారు. టికెట్ల సంఖ్య పెంచడంతో గత నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీ రోజుకు 75 వేల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు, 25 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లతో పాటు వర్చువల్‌ సేవా టికెట్లు(Vartual Seva Tickets), వీఐపీ దర్శన టికెట్ల ద్వారా సుమార్ 75 వేల మందికి పైగా శనివారం స్వామి వారిని దర్శించుకున్నారు. 


అద్దె గదుల కొరత 


తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరుగుతుండడంతో అద్దె గదుల కొరత ఏర్పడింది. గదులు దొరక్క భక్తులు ఇబ్బంది పడుతున్నారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న నాద నీరాజనం షెడ్డు వద్ద భక్తులు అధిక సంఖ్యలో సేదతీరుతున్నారు. తిరుమలలో 1500 లకు పైగా గదులలో మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ కారణంగా గదుల కొరత ఏర్పడింది. కరోనాకు ముందు నాటి పరిస్థితులు ఇప్పుడు తిరుమలలో కనిపిస్తున్నాయి. తిరుపతి(Tirupati)లో రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు భక్తులు అందిస్తున్నారు. మార్చి 1వ తేదీకి సంబంధించిన టోకెన్లను ఆదివారం టీటీడీ(TTD) జారీ చేసింది. సాధారణ సర్వదర్శనం ద్వారా శ్రీవారి(Srivari)ని దర్శించుకోవడానికి తిరుపతికి వచ్చే భక్తులు 3 రోజుల పాటు వేచి ఉండాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. భక్తుల దర్శనానికి సుమారు 12 గంటల ముందు మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు. అలిపిరి(Alipiri)లో టికెట్లను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే కొండపైకి పంపిస్తున్నారు. టికెట్లు(Tickets) లేని భక్తులను తిరుపతిలోనే నిలిపివేస్తున్నారు. దీంతో సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా 3 రోజుల పాటు తిరుపతిలోనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.


ఇకపై భక్తులు ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే (TTD New Rules)


శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు అందరూ తప్పనిసరిగా దర్శన టిక్కెట్లు ఉంటేనే అలిపిరి తనిఖీ కేంద్రం, నడకదారి వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కొండకు అనుమతించనుంది. అంతే కాకుండా కోవిడ్ నిబంధనలు మేరకు ప్రతి భక్తుడు మాస్క్ ధరించి ఉంటేనే కొండకు అనుమతించనున్నారు. ఎటువంటి ప్లాస్టిక్ కవర్ లు తీసుకెళ్ళరాదని సూచించారు.‌ అంతేకాకుండా తిరుమలలో నిషేధిత వస్తువులైన మాంసం, మద్యం, బీడీలు, సిగెరెట్లు తదితర పొగాకు సంబందిత వస్తువులు పూర్తిగా నిషేధించిన కారణంగా కనుక భక్తులు ఎవరూ తమ వెంట సదరు వస్తువులను తీసుకొని రాకూడని హెచ్చరించారు.


ఘాట్ రోడ్డు అనుమతి సమయాలు ఇవీ (Tirumala Ghat Road Timings)


శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు ఎక్కువ శాతం సొంత వాహానాల్లో, బాడుగ వాహనాల్లో వస్తుంటారు. దీంతో ఎల్లప్పుడూ తిరుమల ఘాట్ రోడ్డులో (Tirumala Ghat Road) వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. కోవిడ్ ప్రభావంతో ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతిలో పూర్తి స్థాయిలో మార్పు చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నుండి ఉదయం 3 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు, ద్విచక్ర వాహనాలను ఉదయం 4 గంటలు నుండి రాత్రి 10 గంటలు వరకు అనుమతించడమే కాకుండా హెల్మెట్ తప్పని సరిగా ధరించి రావాలని టీటీడీ తెలిపింది. ఘాట్ రోడ్డులో ప్రయాణ సమయంలో అతివేగం ప్రమాదకరం కావడంతో భక్తులు అందరూ నిదానంగానే ప్రయాణించాలని సూచించింది టీటీడీ.