ఏపీలో టిడ్కో ఇళ్ల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంపై అపవాదు ఉంది. గత ప్రభుత్వం ఇళ్లను రెడీ చేసి వెళ్లినా, ఈ ప్రభుత్వం కేవలం రంగులు మార్చడానికే ప్రాధాన్యం ఇచ్చింది కానీ లబ్ధిదారులకు కేటాయించలేదనే విమర్శలున్నాయి. మూడేళ్లవుతున్నా.. ఎక్కడా గృహప్రవేశాలు జరగలేదు. అయితే అదంతా గత ప్రభుత్వం పాపమేనంటున్నారు వైసీపీ నేతలు. గత ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకుండా కేవలం బిల్డింగ్ లు కట్టి, రంగులేసి తప్పించుకునిపోయిందని చెబుతున్నారు. పురపాలక శాఖ మంత్రిగా గతంలో బొత్స సత్యనారాయణ పనిచేసినప్పుడు కూడా దీనిపై ఎప్పటికప్పుడు డెడ్ లైన్లు ప్రకటించారే కానీ, ఎక్కడా ఇళ్ల కేటాయింపులు జరగలేదు. తాజాగా ఆ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కి వచ్చింది. ఆయన కొత్తగా చార్జ్ తీసుకున్న తర్వాత కాస్త పురోగతి కనిపిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. వారితో గృహప్రవేశాలు చేయించారు. 




ఏపీలో టిడ్కో ఇళ్ల కేటాయింపు మళ్లీ జోరందుకుంది. గతంలో చంద్రబాబు హయాంలోనే టిడ్కో ఇళ్లలో గృహప్రవేశాల హడావిడి జరిగినా.. ఆ తర్వాత మౌలిక వసతుల పేరుతో ఇళ్ల కేటాయింపు వాయిదా వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగనన్న కాలనీలపై ఫోకస్ పెట్టారు కానీ, టిడ్కో ఇళ్లను పట్టించుకోలేదు. అయితే టిడ్కో ఇళ్ల ఆలస్యానికి గత ప్రభుత్వమే కారణం అని చెప్పిన వైసీపీ సర్కారు.. తమ హయాంలో లోన్లు కూడా లేకుండా వాటిని పేదలకు రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పింది. అన్నట్టుగానే 1 రూపాయి నామమాత్రపు రుసుము స్వీకరించి పేదలకు ఇళ్లు ఇస్తున్నారు. ఇప్పటి వరకు మౌలిక వసతులు పూర్తయిన చోట 20 వేల ఇళ్లు కేటాయంచారు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 672 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. వారితో గృహప్రవేశాలు చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్దన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. నెలాఖరునాటికి లేదా వచ్చే నెలలో మరో లక్ష ఇళ్లు రెడీ చేస్తామని, ఈ ఏడాది చివరి నాటికి 2.62 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తామని జగన్ తమకు టార్గెట్ ఇచ్చారని చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్. 


ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలో 32.40 ఎకరాల విస్తీర్ణంలో మూడు కేటగిరీల్లో 1056  ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంకు సంబందించిన  672 ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు అందజేసింది. 2019 ఎన్నికల ప్రచారంలో టిడ్కో ఇళ్లపై జగన్ కీలక హామీ ఇచ్చారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లను బ్యాంకు లోన్ అవసరం లేకుండా లబ్ధదారులకు ఇచ్చేస్తామన్నారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. 


ప్లీనరీ తర్వాత జోరు.. 
వైసీపీ ప్లీనరీ తర్వాత ప్రజల్లో ఎక్కడెక్కడ అసంతృప్తి ఉందో ఆయా విషయాలపై ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టినట్టుంది. విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభించారు, జగనన్న కాలనీల్లో మూడో ఆప్షన్ కింద ఉన్న ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచారు. తాజాగా టిడ్కో ఇళ్ల కేటాయింపులో కూడా స్పీడ్ పెంచారు. ఈ ఏడాది చివరినాటికి 2.62 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. ఎన్నికల నాటికి టిడ్కో ఇళ్ల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంపై తప్పు లేకుండా చూసుకోవాలనుకుంటున్నారు జగన్.