MLA quota MLC elections in Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల మరో రెండు రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అంతలోనే మరోసారి అధికార పార్టీ నేతలకు పండుగ లాంటి వార్త వచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ (EC) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. త్వరలో ఖాళీ కానున్న తెలంగాణలో ఐదు, ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని తాజా షెడ్యూల్‌లో ఈసీ పేర్కొంది. మార్చి 20న పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. మార్చి 29న ఏపీలో 5 మంది ఎమ్మెల్సీలు, తెలంగాణలో 5 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.


ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా..
ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెలలో పోలింగ్ జరగనుంది. అయితే ఇవి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కావడంతో దాదాపుగా అన్ని సీట్లు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. జంగా కృష్ణమూర్తి , దువ్వారపు రామారావు, యనమల రామకృష్ణుడు, పి.అశోక్‌బాబు, తిరుమలనాయుడు పదవీకాలం మార్చి 29న ముగియనుంది. ఈ పదవీకాలం ముగుస్తున్న వారిలో జంగా కృష్ణమూర్తి మినహా మిగతా ఎమ్మెల్సీలు టీడీపీకి చెందిన వారే. కానీ ఏపీలో ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి సైతం టీడీపీలో చేరారు. దాంతో టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుండగా.. ఎమ్మెల్యేల బలం ఉన్నందున ఈ 5 ఎమ్మెల్సీ సీట్లు కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు దక్కనున్నాయి.  


ఎమ్మెల్సీ రేసులో ఉన్నది ఎవరంటే.. 
ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన, బీజేపీల నుంచి ఒక్కొక్కరు రేసులో ఉన్నారు. టీడీపీ నుంచి జవహర్, వంగవీటి రాధ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేర్లు వినిపిస్తున్నాయి. కూటమి నుంచి వీరే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి జనసేన పార్టీకి ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన కార్యదర్శి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఈ ఎమ్మెల్సీ సీటును ఇవ్వనున్నారు. ఇదివరకే మంత్రిపదవి ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నిక పూర్తయ్యాక నాగబాబుకు శాఖను కేటాయించే అవకాశం ఉంది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి సీటును  బీజేపీకి కేటాయిస్తే కనుక మిగిలిన 4 ఎమ్మెల్సీ సీట్లను టీడీపీ నేతలకే కేటాయించే అవకాశం ఉంది. 


ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసీ షెడ్యూల్ విడుదల, తేదీల వివరాలు


ఎన్నికల నోటిఫికేషన్ విడుదల - మార్చి 3, 2025
- నామినేషన్లకు చివరి తేదీ - మార్చి 10, 2025 సోమవారం
- నామినేషన్ల పరిశీలన - మార్చి 11, 2025
- నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు - మార్చి 13, 2025
- ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ - మార్చి 20, 2025 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
- ఓట్ల లెక్కింపు - మార్చి 20న సాయంత్రం 5 గంటలకు


Also Read: GV Reddy Resign: టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది