ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేతలు పీఆర్సీ విషయంలో చేస్తున్న ఉద్యమంలో భాగంగా మూడో తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడ వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి సత్తా చాటుతామని ప్రకటించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ ర్యాలీ ఉంటుందా ఉండదా అనే ఓ సందేహం ప్రారంభమయింది. పోలీసులను అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని ఇంత వరకూ ఇవ్వలేదని కృష్ణా జిల్లాకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు నేతలు ప్రకటించారు. 


మరో వైపు పీఆర్సీ సాధాన సమితి నేతలు చలో విజయవాడ ఖచ్చితంగా ఉంటుందన్న ప్రకటనను మరోసారి చేయడం లేదు. ఉద్యోగ సంఘాలు చర్చలకు రావడం లేదని మంత్రులు అదే పనిగా ఆరోపణలు చేస్తూండటంతో లిఖితపూర్వకంగా ఆహ్వానిస్తే వస్తామని వారు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే లిఖితపూర్వకంగా ఆహ్వానం పంపింది.  ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పాత డిమాండ్లనే వినిపించారు. కానీ అంశాల వారీగా పరిశీలిస్తామని కమిటీ సభ్యులు వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. 


ఇప్పటికే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నామని ఇప్పుడు పాత జీతాలు ఇవ్వాలంటే ఎలా అని కమిటీ సభ్యులు ఉద్యోగ సంఘాల నేతల్ని ప్రశ్నించారు. జీవోలు కూడా రద్దు చేయడం కుదరదని స్పష్టం చేశారు. అలాగే అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక విషయంలోనూ ఎలాంటి సమాధానం చెప్పలేదు. అయితే ఉద్యోగసంఘాల నేతలు చర్చల తర్వాత మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడారు. చర్చలు జరుగుతున్న సమయంలో.. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సమ్మె వద్దని హైకోర్టు కూడా సూచించిందని... ఉద్యోగ సంఘాలు హైకోర్టు సూచనలను అయినా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. చలో విజయవాడ ఉంటుందని చెప్పారని సజ్జల మీడియాకు తెలిపారు. 


ఉద్యోగుల జీతాలు రికవరీ చేయవద్దని హైకోర్టు ఆదేశించిన అంశంపై సజ్జల క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగుల జీతాలు ఎక్కడా రికవరీ చేయడం లేదన్నారు. ఐఆర్ తాత్కాలిక అడ్జస్ట్ మెంట్ అని ఇప్పుడు రీఅడ్జస్ట్ మెంట్ చేస్తున్నాం కానీ రికవరీ కాదు అన్నారు. ప్రభుత్వంతో  ఉద్యోగుల కమిటీ చర్చల తర్వాత జిల్లాల్లోనూ ఉద్యమం చేస్తున్న వారికి చలో విజయవాడ ఉంటుందా ఉండదా ్‌న సందేహాలు ఏర్పడ్డాయి. ఉద్యోగ సంఘాల నేతలే దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. లేకపోతే గందరగోళం ఏర్పడి చివరి క్షణంలో నిర్వహించాలనుకున్నా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది.